By - jyotsna |15 May 2026 10:27 AM IST
గత ఏప్రిల్ నెలలో వివిధ ఆపరేషన్లలో నేరస్థులను, అక్రమ రవాణాదారులను అరెస్ట్ చేసిన పోలీసులు
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపింది.
గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో భాగంగా 120 మంది చిన్నారులను అక్రమార్కుల చెర నుంచి సురక్షితంగా రక్షించింది. వీరిలో 96 మంది బాలురు, 24 మంది బాలికలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రక్షించిన చిన్నారులందరినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగించినట్లు తెలిపారు.
ఈ విషయాలను దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. 'నన్హే ఫరిస్తే' పేరుతో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ ద్వారా చిన్నారులను రక్షించినట్లు చెప్పారు. అలాగే 'ఆపరేషన్ ఆహాత్'లో భాగంగా మరో ఐదుగురు బాలురను కాపాడి, ఇద్దరు మానవ అక్రమ రవాణాదారులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ప్రయాణికుల భద్రత కోసం చేపట్టిన 'యాత్రి సురక్ష' ఆపరేషన్‌లో 79 మంది నేరస్థులను అదుపులోకి తీసుకుని 71 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.54.52 లక్షల విలువైన దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ప్రయాణికులు రైళ్లలో లేదా స్టేషన్లలో మర్చిపోయిన వస్తువులను తిరిగి అందించే 'ఆపరేషన్ అమానత్' కింద రూ.83.35 లక్షల విలువైన 319 వస్తువులను గుర్తించి యజమానులకు అప్పగించినట్లు తెలిపారు.
అదేవిధంగా 'నార్కోస్' ఆపరేషన్‌లో భాగంగా మత్తుపదార్థాల రవాణాను అడ్డుకుని రూ.86.17 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో 16 మంది నిందితులను అరెస్టు చేసి తదుపరి విచారణ కోసం జీఆర్పీకి అప్పగించినట్లు సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపింది. గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో భాగంగా 120 మంది చిన్నారులను అక్రమార్కుల చెర నుంచి సురక్షితంగా రక్షించింది. వీరిలో 96 మంది బాలురు, 24 మంది బాలికలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రక్షించిన చిన్నారులందరినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగించినట్లు తెలిపారు.

