Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
15 ఏండ్ల బాలికతో బలవంతంగా క్షమాపణ చెప్పించారు: రాహుల్ గాంధీ

15 ఏండ్ల బాలికతో బలవంతంగా క్షమాపణ చెప్పించారు: రాహుల్ గాంధీ

V6 Velugu 1 week ago
  • నిరసనకారుల ఇండ్లకు గూండాలను పంపారు: రాహుల్ గాంధీ
  • విద్యార్థులపై కేంద్ర సర్కారు దౌర్జన్యం చేస్తున్నది
  • విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పేపర్​ లీకేజీకి
  • అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తే బెదిరిస్తున్నది
  • దేశ అగ్రశ్రేణి నాయకత్వం కంటే యువతలోనే ఎక్కువ ధైర్యం ఉంది
  • హోం మంత్రి అమిత్‌ షా బాధ్యతల నుంచి పారిపోతున్నారని ఫైర్​
  • వివిధ రాష్ట్రాలకు చెందిన యువ నిరసనకారులతో విలేకరుల సమావేశం

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసనల్లో విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడి ఘటనకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షానే నేరుగా బాధ్యుడు అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు, నిరంతరం జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేసినందుకు వారిపై దాడులు చేసి, బెదిరింపులకు గురిచేసి వేధించారని ఆరోపించారు. బుధవారం వివిధ రాష్ట్రాలకు చెందిన యువ నిరసనకారులతో కలిసి రాహుల్‌ గాంధీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలని కోరడం నేరం కాదని, విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ''కేంద్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాల్సింది పోయి విద్యార్థుల ఇండ్లకు గూండాలను పంపించింది. ఒక 15 ఏండ్ల బాలికతో బలవంతంగా క్షమాపణ చెప్పించారు. ఇదంతా ఒక పెద్ద నాటకం.. దీనిని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం' అని వ్యాఖ్యానించారు.మాకు సరిగ్గా పనిచేసే విద్యావ్యవస్థ కావాలని, వరుసగా జరుగుతున్న పరీక్షల పేపర్ లీకేజీలు తక్షణమే ఆగాలని అన్నారు. ఈ దేశ యువత భవిష్యత్తుకు రక్షణ, గౌరవం దక్కాలని రాహుల్​ పేర్కొన్నారు.
విద్యార్థులు ఎలాంటి తప్పు చేయలేదు..

తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా ప్రశ్నిస్తున్న విద్యార్థుల ఇండ్లకు గూండాలను పంపి బెదిరింపులకు దిగుతున్నారని, వారితో క్షమాపణలు చెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ''యువ నిరసనకారులతో నేను మాట్లాడాను. వారు తమపై జరిగిన దాడులు, దెబ్బలు, బెదిరింపుల గురించి వివరించారు. తమ భవిష్యత్తు కోసం నిలబడిన ఈ విద్యార్థులను చూసి నేను ఎంతో గర్విస్తున్నాను'అని పేర్కొన్నారు. వారు ఎలాంటి తప్పూ చేయలేదని, ధ్వంసమవుతున్న విద్యావ్యవస్థను ప్రశ్నిస్తున్న ఈ విద్యార్థులే రాజ్యాంగానికి అసలైన పరిరక్షకులని పేర్కొన్నారు.

వారికి ధైర్యం ఉంది.. ప్రధానికి, హోంమంత్రికి లేదు

మీడియాకు విద్యార్థులను పరిచయం చేస్తూ.. దేశ అగ్రశ్రేణి నాయకత్వం కంటే ఈ యువతలోనే ఎక్కువ ధైర్యం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ''వీరు భారత మీడియా ముందు నిలబడిన యువకులు. కానీ ఇక్కడ వచ్చి నిలబడే ధైర్యం అమిత్ షాకు, ప్రధానికి లేదు'' అని చురకలంటించారు. యువత ఇక్కడికి రావడమే ధైర్యమైన చర్య అని కొనియాడారు. ''అది అంత తేలిక కాదు. వారు వేధింపులు, హింస, వేదనను ఎదుర్కొంటున్నారు. వారు తమ భావాలను ఇంత స్పష్టంగా మాట్లాడే ధైర్యం కలిగి ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఈ దేశానికి సరిగ్గా ఇలాంటి యువత అవసరం. అలాంటి వారు వేల సంఖ్యలో ఉన్నారు, వారు చేసిన పనికి నేను ఎంతో గర్వపడుతున్నాను' అని వ్యాఖ్యానించారు. విద్యార్థులపై పోలీసుల చర్యకు సమాధానం చెప్పడంలో అమిత్ షా విఫలమయ్యారని, ఆయన తన బాధ్యతల నుంచి పారిపోతున్నారని అన్నారు. ''ఈ హింసకు బాధ్యుడైన వ్యక్తి, ఈ యువతిపై పెల్లెట్ గన్ ప్రయోగానికి కారణమైన వ్యక్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్లమెంటుకు వచ్చే మర్యాద కూడా ఆయనకు లేదు. జరిగిన దానిపై వ్యాఖ్యానించే కనీస మర్యాద గానీ, ధైర్యం గానీ ఆయనకు లేవు' అని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.

నేను పోలీసులను అడ్డుకోలే.. విద్యార్థులను కాపాడినా: రియా అహీర్

పలువురు విద్యార్థులు నిరసన సమయంలో తమకు ఎదురైన అనుభవాలను, పోలీసుల దౌర్జన్యాలను మీడియాకు వివరించారు. సుమారు 30 మంది నిరసనకారులను అక్రమంగా నిర్బంధించకుండా పోలీసులను అడ్డుకున్నదని తానేనని 15 ఏండ్ల రియా అహీర్ తెలిపారు. ''దయచేసి మీ కథనాలను మార్చండి. 30 మందిని అక్రమ అరెస్టు నుంచి కాపాడిన అమ్మాయిని నేనే. నేను పోలీసులను అడ్డుకోలే.. స్టూడెంట్లను కాపాడా. ఇందుకు నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు' అని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News