Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
21 రైల్వే ప్రాజెక్టులకు రూ.51 వేల కోట్లు..రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి:  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

21 రైల్వే ప్రాజెక్టులకు రూ.51 వేల కోట్లు..రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

V6 Velugu 1 week ago
  • గద్వాల జిల్లాను రైల్వే హబ్ గా అభివృద్ధి చేస్తామని వెల్లడి
  • ఎంపీ అరుణతో కలిసి అలంపూర్, మహబూబ్​నగర్​ స్టేషన్ల సందర్శన

గద్వాల/అలంపూర్/మహబూబ్‌నగర్, వెలుగు: తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలోని 21 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం రూ.51 వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. అమృత్ భారత్ స్కీమ్‌లో భాగంగా తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్లను తొలి దశలో ఆధునికీకరిస్తున్నామని వెల్లడించారు. ఆదివారం గద్వాలలోని హరిత హోటల్‌లో బస చేసిన కిషన్ రెడ్డి సోమవారం ఉదయం మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి అలంపూర్‌లోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. తర్వాత మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌ కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం 2025-26లో తెలంగాణకు 5,454 కోట్లు కేటాయించిందన్నారు. 2009--2014 మధ్య రాష్ట్రంలో కేవలం 87 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం 888 కిలోమీటర్ల మేర లైన్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. గత పదేళ్లలో తెలంగాణలో 520 ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ నిర్మాణాలు పూర్తి చేశామని తెలిపారు. ఈ ఏడాది రూ.4,883 కోట్లతో 118 రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

అలంపూర్ స్టేషన్‌కు రూ.6.07 కోట్లు

అమృత్ భారత్ స్కీమ్‌లో భాగంగా అలంపూర్ రైల్వే స్టేషన్‌లో రూ.6.07 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను కిషన్ రెడ్డి పరిశీలించారు. రైల్వే స్టేషన్ దగ్గర రూ.45 కోట్లతో ఆర్‌ఓబీ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు 95 శాతం పూర్తయ్యాయని, త్వరలో ప్రధాని మోదీ స్టేషన్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం గద్వాలలో రూ.42.82 కోట్లతో జరుగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. గద్వాలలో మరో ఆర్‌ఓబీకి రూ.66 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. గద్వాల రైల్వే స్టేషన్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ చెప్పారు.

ఎయిర్‌పోర్టుల తరహాలో రైల్వే స్టేషన్లు

దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లను ఎయిర్‌పోర్టుల తరహాలో అభివృద్ధి చేయాలని ప్రధాని సంకల్పిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు డబుల్ లైన్ పూర్తయిందని తెలిపారు. దేవరకద్ర నుంచి కృష్ణ వరకు కొత్త రైల్వే లైన్‌ను అభివృద్ధి చేశామని చెప్పారు. దేశంలో ఏడు బుల్లెట్ రైళ్లను ప్రకటించగా.. అందులో తెలంగాణకు మూడు కేటాయించినట్లు తెలిపారు. రెండు బుల్లెట్ రైళ్లు వస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెంది, పరిశ్రమలు, పర్యాటకులు పెరుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రైల్వే డీఆర్‌ఎం సంతోష్ కుమార్ వర్మ, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News