Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అజ్ఞాతంలోకి మిల్లర్లు..డీఫాల్టర్లను వెంటాడుతున్న సివిల్‌ సప్లయిస్‌, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

అజ్ఞాతంలోకి మిల్లర్లు..డీఫాల్టర్లను వెంటాడుతున్న సివిల్‌ సప్లయిస్‌, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

V6 Velugu 1 week ago
  • 78 మందిపై కేసులు, 32 మంది అరెస్ట్‌
  • మరో 46 మంది కోసం ముమ్మర గాలింపు
  • కేసుల భయంతో ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసి పరార్
  • వనపర్తి జిల్లాలో బకాయిలున్న రెండు మిల్లుల కూల్చివేత

హైదరాబాద్‌/ నెట్​వర్క్, వెలుగు: కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్‌ మిల్లర్లపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ఆయా మిల్లర్ల నుంచి రూ.6 వేల కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉండగా, చెల్లించకుండా మొండికేస్తున్నారు. ఈ క్రమంలో డిఫాల్ట్‌ మిల్లర్లను గుర్తిస్తూ సివిల్‌ సప్లయిస్‌, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు, తనిఖీలు, కేసులు, అరెస్టులు ముమ్మరం చేశారు. అవసరమైన చోట పోలీసుల సహకారం తీసుకుంటున్నారు. ఇప్పటికే 78 మంది అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు నమోదు కాగా.. వారిలో 32 మందిని అరెస్టు చేశారు. మరో 46 మంది కోసం గాలిస్తున్నారు. కేసుల భయంతో కొందరు మిల్లర్లు ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లగా.. మరికొందరు విదేశాలకు చెక్కేసే ప్లాన్​లో ఉన్నట్టు తెలిసింది.

రికార్డుకు.. నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం

సీఎంఆర్‌ కోసం ప్రభుత్వం మిల్లర్లకు అప్పగించిన ధాన్యం ఎంత? మిల్లింగ్‌ చేసి ఎంత మొత్తంలో బియ్యం అప్పగించారు ? రికార్డుల్లో ఉన్న వివరాలకు, క్షేత్రస్థాయిలో మిల్లుల్లో ఉన్న నిల్వల మధ్య తేడా ఎంత ? అనే అంశాలను ఫిజికల్​గా తనిఖీల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో రికార్డులకు, ఉన్న నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు గుర్తిస్తున్నారు. 2022 నుంచి 2025 వరకు వానాకాలం సీజన్ల సీఎంఆర్‌ స్టాక్‌ తనిఖీ చేస్తున్నారు. డీఫాల్టర్లపై కేసులు నమోదు చేయడంతో పాటు రికవరీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు రూ.1,060 కోట్లవరకు బకాయిలను రికవరీ చేసినట్టు సమాచారం. బకాయి ధాన్యం విలువలో 50 శాతం వెంటనే చెల్లించేలా కొందరు మిల్లర్ల నుంచి అండర్‌టేకింగ్‌లు తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. డిఫాల్ట్‌ మిల్లులకు కొత్తగా ధాన్యం కేటాయించడంలేదు.

వనపర్తిలో మిల్లుల కూల్చివేత

ప్రభుత్వం కేటాయించిన వడ్లను మిల్లింగ్ చేసి.. బియ్యాన్ని మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ, కొందరు మిల్లర్లు బియ్యాన్ని అప్పగించకుండా బహిరంగ మార్కెట్‌లో అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బులను ఇతర వ్యాపారాలు, రియల్‌ ఎస్టేట్‌ తదితర రంగాలకు మల్లించినట్టు అనుమానిస్తున్నారు. దీంతో మిల్లుల్లో ఫిజికల్​తనిఖీలు చేపట్టిన అధికారులు మిల్లు యజమానుల ఆర్థికలావాదేవీలు, బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. డిఫాల్ట్‌ మిల్లర్లపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్లలోని చాముండి రైస్‌ మిల్లు దాదాపు రూ.13.33 కోట్ల బకాయి ఉండగా, వెల్లంకొండిలోని సాంబశివ రైస్‌ మిల్లు రూ.3.92 కోట్ల మేరకు బకాయి ఉన్నట్టు గుర్తించారు. ఈ రెండు మిల్లులను కలెక్టర్‌ ఆధ్వర్యంలోని అధికార యంత్రాంగం కూల్చివేసింది. డిఫాల్టర్ల ఆస్తులను ఈ విధంగా కూల్చడం రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారి.

జిల్లాల వారీగా ఇలా..

  • యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనంతారంలోని యాదాద్రి మిల్లులో ఐదుగురు పార్ట్​నర్లు ఉండగా రూ. 24 కోట్ల విలువైన 6,800 టన్నుల సీఎంఆర్​ను బయట అమ్ముకున్నారు. దీంతో నూనె వెంకటేశ్వర్లు అనే పార్ట్​నర్​ను పోలీసులు అరెస్ట్​ చేయగా, మిగిలినవాళ్లు నెలరోజులుగా పరారీలో ఉన్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలోని శ్రీవిద్య మిల్లులో యాదాద్రి మిల్లు భాగస్వామి రామ్మోహన్ అనే వ్యక్తితో పాటు మరొకరు పార్టనర్​గా ఉన్నారు. ఈ మిల్లులో రూ. 33 కోట్ల విలువైన 11,577 టన్నుల వడ్లు మాయం చేశారు. దీంతో ఈ ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
  • జనగామ జిల్లా నెల్లుట్లలోని మణికంఠ రైస్​ మిల్లులో 8 మంది మహిళలు సహా 11 మంది భాగస్వాములు ఉన్నారు. ఇందులోనూ నూనె వెంకటేశ్వర్లు పార్ట్​నర్​​కాగా, మిగిలినవారంతా తమ ఫోన్లు స్విచ్ఛాఫ్​ చేసుకొని పరారీలో ఉన్నారు. వీరి కోసం అధికారులు గాలిస్తున్నారు. తెలిసినవారి ద్వారా వారి ఆచూకీ కనుగొని అరెస్ట్​చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
  • కరీంనగర్​ జిల్లాలో ఇటీవల నిర్వహించిన విజిలెన్స్ దాడుల్లో హుజురాబాద్ మండలం బోర్నపల్లిలోని సాయి ట్రేడర్స్ ఓనర్ జ్యోతిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆమె అరెస్ట్ కాకముందే కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నట్టు తెలుస్తోంది.
  • పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు డిఫాల్ట్​ మిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒకరిపై పీడీ యాక్ట్ అమలు చేశారు. ఇందులో ముగ్గురు ఇంకా జైలులో ఉన్నారు. నలుగురు బెయిల్ పై బయటకు వచ్చారు.
  • భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దేముత్తారం గ్రామానికి చెందిన వైష్ణవి రైస్ మిల్లులో రూ. 3.98 కోట్ల ధాన్యం మాయం కాగా మిల్లు ఓనర్ యంసాని సంతోష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
  • జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటీవల ఓ రైస్‌ మిల్లుపై కేసు నమోదు చేసి యజమానిని అరెస్టు చేశారు. మిగతా మిల్లుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
  • `నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 80 మంది డిఫాల్ట్​ మిల్లర్లుండగా.. సుమారు రూ.195 కోట్ల బకాయిలున్నాయి. ఎనిమిది మంది మిల్లర్లపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అయితే, కొందరు డిఫాల్ట్‌ మిల్లర్లు కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం అరెపల్లి శివారులోని ఏఆర్‌ఎం పారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లులో సుమారు రూ.18.75 కోట్ల విలువైన ప్రభుత్వ వడ్లను పక్కదారి పట్టించినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో మిల్లు యజమాని జైలుశిక్ష కూడా అనుభవించారు. బియ్యం డబ్బులు రికవరీ చేసేందుకు సివిల్‌ సప్లయిస్‌ అధికారులు మిల్లును వేలం వేసేందుకు సిద్దపడగా.. యజమాని కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాడు.
  • కామారెడ్డిజిల్లాలో నాలుగు రైస్‌ మిల్లులపై కేసులు నమోదు చేసి యజమానులను అరెస్టు చేశారు.
  • నిర్మల్‌ జిల్లాలో దాదాపు 50 డిఫాల్ట్‌ రైస్‌ మిల్లులు ఉన్నట్లు సమాచారం. దాదాపు రూ.700 కోట్ల విలువైన ధాన్యం మాయం అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆరుగురు రైస్‌ మిల్లుల యజమానులను అరెస్టు చేశారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News