Dailyhunt
ఐటీ కారిడార్లో సింగిల్ రైడర్లతోనే ట్రాఫికర్ : డీసీపీ రంజన్ రతన్ కుమార్

ఐటీ కారిడార్లో సింగిల్ రైడర్లతోనే ట్రాఫికర్ : డీసీపీ రంజన్ రతన్ కుమార్

V6 Velugu 5 days ago
  • గంటలో 10,138 వాహనాలపై ఒక్కరే ప్రయాణిస్తున్నరు
  • డబుల్ రైడర్లు 3,584 మంది..
  • మాదాపూర్ ట్రాఫిక్ పోలీసుల సర్వేలో వెల్లడి
  • ఐటీ ఉద్యోగులు సహకరిస్తే ట్రాఫిక్​ ఫ్రీ సిటీగా సైబరాబాద్: డీసీపీ రంజన్ రతన్

గచ్చిబౌలి, వెలుగు: సాప్ట్​వేర్ ఉద్యోగులు, సామాన్య ప్రజలు సహకరిస్తే సైబరాబాద్​ను కచ్చితంగా​ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చుకోవచ్చని ట్రాఫిక్ అడ్మిన్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ తెలిపారు. ఐటీ కారిడార్​లో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీపై సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక సర్వే నిర్వహించారు.

మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు సైబర్ టవర్స్ పరిసరాల్లో ఉదయం పూట (పీక్ అవర్) జరిపిన ఈ అధ్యయనంలో కీలక విషయం బయటపడింది. వాహనాలపై ఒక్కరే ప్రయాణించడం (సింగిల్ రైడింగ్) వల్లే ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతోందని పోలీసులు గుర్తించారు.

ఈ చిన్న మార్పులతో ట్రాఫిక్​కు చెక్

కేవలం గంట వ్యవధిలోనే ఏకంగా 10,138 వాహనాలపై ఒక్కరే ప్రయాణించగా, ఇద్దరు కలిసి ప్రయాణించే వారు (డబుల్ రైడర్లు) 3,584 మంది మాత్రమే ఉన్నారు. అంటే డబుల్ రైడర్ల కంటే సింగిల్ రైడర్లే 6,554 మంది ఎక్కువగా ఉన్నారని డీసీపీ తెలిపారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో వాహనాన్ని రోడ్డు మీదకు తీసుకురావడం వల్లే వాహనాల సంఖ్య పెరిగి భారీ ట్రాఫిక్ జామ్​లు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

దీనివల్ల విలువైన సమయం వృథా అవ్వడంతో పాటు, పెట్రోల్ ఖర్చు భారం కావడం, ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని డీసీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ ఉద్యోగులు వీలైనంత వరకు రైడ్ షేరింగ్, సహోద్యోగులతో కార్ పూలింగ్ చేయడం లేదా బస్సు, మెట్రో వంటి పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్​ను వాడాలని ఆయన కోరారు. ఈ చిన్న మార్పులతో ట్రాఫిక్ సమస్యకు పెద్ద పరిష్కారం దొరుకుతుందని ఆయన సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News