అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ జెట్ ఫైటర్ కూలిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ జెట్ ఫైటర్ లోని రెండో ఫైలట్ ను రక్షించినట్లు అమెరికా చెబుతుండగా..రెస్క్యూ కోసం వచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక ట్రాన్స్ పోర్ట్ విమానాన్ని కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది.
ఇరాన్‌కు సెంట్రల్ కమాండ్ మీడియా ఖాతమ్ అల్-అన్బియా ప్రకారం.. దక్షిణ ఇస్ఫహాన్ ప్రాంతంలోకి చొరబడిన అమెరికా విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇందులో రెండు బ్లాక్ హాక్ (Black Hawk) హెలికాప్టర్లు, C-130 మిలిటరీ రవాణా విమానం ఉన్నట్లు తెలిపింది. అవి ప్రస్తుతం మంటల్లో తగలబడుతున్నాయంటూ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమెరికా విమానాలతో పాటు ఇజ్రాయెల్ దళాలకు చెందిన డ్రోన్‌ను కూడా కూల్చివేసినట్లు ఇరాన్ వెల్లడించింది.నైరుతి ఇరాన్‌లో జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ కారణంగా కనీసం ఐదుగురు మృతిచెందినట్లు సమాచారం. అయితే మృతులు పౌరులా లేక సైనికులా అన్నది ఇరాన్ స్పష్టం చేయలేదు.
తుపాకులు పట్టుకుని స్థానికులు.. వైరల్ అవుతున్న ఫోటోలు..
ఎడారి ప్రాంతంలో అమెరికా విమాన శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్న ఫోటోలు, వాటి నుంచి ఎగిసిపడుతున్న పొగను ఇరాన్ మీడియా బయటపెట్టింది. అమెరికా పైలట్ కోసం స్థానిక ఇరాన్ పౌరులు తుపాకులు పట్టుకుని, ఇరాన్ జెండాలతో వెతుకుతున్న వీడియోలు అంతకుముందే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
►ALSO READ | నరకానికి తలుపులు తెరుచుకుంటయ్: ట్రంప్ వార్నింగ్‌కు అదే రేంజ్లో ఇరాన్ కౌంటర్
మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ పై అమెరికా స్పందిస్తూ.. తమ రెండో క్రూ మెంబర్‌ను సురక్షితంగా రక్షించగలిగామని ప్రకటించింది. ఇరాన్ మాత్రం అమెరికా వాదనలు ఖండించింది. రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది అని ఇరాన్ మిలిటరీ గట్టిగా వాదిస్తోంది.

