హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈనెల 25 నుంచి ప్రారంభంకానున్న స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియను అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సి.
సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం బీఆర్‌కే భవన్‌లోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో రాష్ట్రంలోని ఎన్నికల నమోదు అధికారులకు (ఈఆర్‌ఓలు) నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాకుండా, అనర్హులైన వారి పేర్లను జాబితా నుంచి పకడ్బందీగా తొలగించాలని ఆదేశించారు.
ఎస్‌ఐఆర్ అమలులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు వీలుగా ఈ శిక్షణలో అధికారులకు 'ఈసీఐనెట్', 'బీఎల్‌వో యాప్' వంటి సాంకేతిక అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శిక్షణ నోడల్ అధికారి బి. చెన్నయ్య ఎస్‌ఐఆర్ ప్రక్రియలోని వివిధ దశలను వివరించగా, పీఎం-ఐటీ డి. చిరంజీవి సాంకేతిక శిక్షణను అందించారు. ఈ సదస్సులో అదనపు సీఈవో డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి, సంయుక్త సీఈవో ఎం. సత్యవాణి, ఉప సీఈవో ఎ.ఎస్. చారి తదితరులు పాల్గొన్నారు.

