Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'బద్లావ్‌ జరూరీ హై' నినాదంతో కేంద్రాన్ని నిలదీస్తాం..సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఫైర్

'బద్లావ్‌ జరూరీ హై' నినాదంతో కేంద్రాన్ని నిలదీస్తాం..సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఫైర్

V6 Velugu 1 week ago
  • ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి
  • నేడు ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడి కేంద్రం తీరు మారాలి: కూనంనేని
  • సీఎంను కించపరిచేలా ఎవరూ మాట్లాడొద్దని సూచన

న్యూఢిల్లీ,హైదరాబాద్‌, వెలుగు: 'దేశంలో మార్పు తప్పనిసరి' అనే నినాదంతో నేడు ఢిల్లీలోని సీపీఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. 'బద్లావ్‌ జరూరీ హై - చేంజ్‌ ఈజ్‌ నెసెసరీ ఫర్‌ ది నేషన్‌' పేరుతో జరిగే ఈ ర్యాలీకి దేశవ్యాప్తంగా వేలాదిమంది రైతులు, కార్మికులు, మహిళలు, యువత, విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారని చెప్పారు. ఈ ర్యాలీలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాస్వామ్య నాయకులు పాల్గొంటారని వెల్లడించారు.

సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. గడిచిన 12 ఏండ్లలో మోదీ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ధరల నియంత్రణ, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, అవినీతి నిర్మూలన, విదేశాల్లోని నల్లధనం రప్పించడం వంటి వాగ్దానాలను మోదీ విస్మరించారని మండిపడ్డారు. వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌, డీలిమిటేషన్‌ వంటి ప్రతిపాదనలతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కె.రామకృష్ణ అన్నారు. ఎన్నికల వ్యవస్థపై రోజురోజుకూ ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయని తెలిపారు. అందువల్ల బ్యాలెట్‌ పేపర్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, ఎన్నికల సంఘం పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ విదేశాల్లో మతసామరస్యం గురించి మాట్లాడుతున్నప్పటికీ, దేశంలో మైనారిటీలపై జరుగుతున్న ఘటనలపై స్పందించడం లేదని విమర్శించారు. మణిపూర్‌లో జరిగిన హింస, చర్చిలు, పాస్టర్లపై దాడులపై మౌనం పాటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం తీరు మారాలి: కూనంనేని

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతోపాటు మత రాజకీయాలకు వ్యతిరేకంగా మంగళవారం ఢిల్లీలో లక్షలాది మందితో భారీ నిరసన ర్యాలీ నిర్వహించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని మఖ్ధూంభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అందరికీ సమానంగా అందాల్సిన విద్య పూర్తిగా ప్రైవేట్‌పరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పరీక్షల పేపర్‌ లీకేజీలు, కుంభకోణాలు, నీట్‌ వివాదాలు విద్యార్థులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు.

విద్యారంగంలో చరిత్రను హేతుబద్ధతకు విరుద్ధంగా కాషాయీకరణ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ఉద్యోగాల ప్రైవేటీకరణ వల్ల శాశ్వత కొలువులు పోయి ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ వ్యవస్థ పెరిగిపోయిందని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి పనిచేయాలనే తపనతో ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. ఆర్టీసీ, సింగరేణి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చూపిన చొరవ అభినందనీయమన్నారు. సీఎం స్థాయిని, హోదాను కించపరిచేలా ఎవరూ మాట్లాడకూడదని, విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు. సాదా బైనామాలు, 22ఏ భూముల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News