Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండ్లన్న ఇంట్లో పెళ్లి సందడి.. 'గబ్బర్ సింగ్' రేంజ్‌లో కూతురు వెడ్డింగ్ సెలబ్రేషన్స్!

బండ్లన్న ఇంట్లో పెళ్లి సందడి.. 'గబ్బర్ సింగ్' రేంజ్‌లో కూతురు వెడ్డింగ్ సెలబ్రేషన్స్!

V6 Velugu 6 months ago

టాలీవుడ్ ప్రొడ్యూసర్, నటుడు బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. తన వాక్చాతుర్యంతో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తనకున్న అపారమైన భక్తితో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బండ్ల గణేష్, ఇప్పుడు ఒక తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చే క్రమంలో మునిగిపోయారు.

ఆయన ముద్దుల కుమార్తె జనని బండ్ల త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. దీంతో వారి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది

వైభవంగా మొదలైన వేడుకలు

ఈ శుభకార్యానికి సంబంధించిన విశేషాలను బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. "శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు.. దేవుడి ఆశీస్సులు, పెద్దల దీవెనలతో మా ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి" అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. పెళ్లికి ముందు నిర్వహించే సంప్రదాయబద్ధమైన 'పసుపు కుంకుమ' వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో కాబోయే అల్లుడు సూర్యతేజ చిలుకూరి, వియ్యంకులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో అవి కాస్తా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నటుడి నుండి స్టార్ ప్రొడ్యూసర్ వరకు..

మహబూబ్ నగర్ జిల్లా నుంచి సాధారణ నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన బండ్ల గణేష్, టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగారు. సుస్వాగతం, మల్లీశ్వరి, ఆంధ్రావాలా వంటి చిత్రాల్లో కమెడియన్‌గా మెప్పించారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై పవన్ కళ్యాణ్‌తో తీసిన 'గబ్బర్ సింగ్' ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో 'బాద్‌షా', 'టెంపర్', అల్లు అర్జున్‌తో 'ఇద్దరమ్మాయిలతో', రామ్ చరణ్‌తో 'గోవిందుడు అందరివాడేలే' వంటి భారీ చిత్రాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ గా ముద్ర వేసుకున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్

కొంతకాలం సినీ నిర్మాణానికి దూరంగా ఉన్న బండ్ల గణేష్, ఇప్పుడు 'BG Blockbusters' అనే కొత్త బ్యానర్‌తో మళ్లీ నిర్మాతగా బిజీ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తూ కెమెరా ముందుకు కూడా వచ్చారు. సరిగ్గా తన కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్పీడ్ పెంచుతున్న సమయంలోనే కుమార్తె వివాహం నిశ్చయం కావడం విశేషం. తన కుమార్తె జననిని ఎంతో గారాబంగా పెంచిన బండ్ల, ఈ పెళ్లిని అత్యంత ప్రతిష్టాత్మకంగా, సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిపించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ తారలు బండ్ల గణేష్ కు శుభాకాంక్షలు.. కొత్త జంట నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అంటూ విష్ చేస్తున్నారు. త్వరలోనే ఈ వివాహ వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు, తేదీలు వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి 'ఈశ్వరా.. పరమేశ్వరా' అంటూ దేవుడిని నమ్ముకునే బండ్ల గణేష్ ఇంట ఇప్పుడు పెళ్లి బాజాలు మోగుతుండటంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News