- జలమయమైన రాజధాని ఢాకా
- స్తంభించిన రవాణా వ్యవస్థ, జనజీవనం అస్తవ్యస్తం
ఢాకా: బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వానలు, వరదలు ,కొండచరియలు విరిగిపడిన వివిధ ఘటనల్లో ఇప్పటివరకు 44 మంది మృతి చెందినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు.
నదులన్నీ ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో దేశవ్యాప్తంగా సుమారు 2.67 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. రాజధాని ఢాకాలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున 6 గంటల వరకు 76 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపైకి భారీగా నీరు చేరడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి జనజీవనం అస్తవ్యస్తమైంది.
రంగంలోకి సైన్యం..
బంగ్లాదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రభావితమైన ఏడు జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దించింది. స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి సైన్యం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. బాధితుల కోసం 1,100కు పైగా తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 44,457 మంది అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. కాగా, బ్రహ్మపుత్ర బేసిన్‌లోని ఉత్తర, వాయవ్య జిల్లాలకు వరద ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని వరద హెచ్చరిక కేంద్రం తెలిపింది. రాబోయే 48 గంటల్లో బంగ్లాదేశ్‌లోని సిల్హెట్, రంగ్‌పూర్, మైమెన్‌సింగ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

