Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బోడుప్పల్‌లోని రామచెరువులో చేపల మృతి..కెమికల్ వ్యర్థాలే కారణమా?

బోడుప్పల్‌లోని రామచెరువులో చేపల మృతి..కెమికల్ వ్యర్థాలే కారణమా?

V6 Velugu 3 weeks ago
  • రంగంలోకి హైడ్రా అధికారులు.. నీటి శాంపిల్స్ సేకరణ

మేడిపల్లి వెలుగు: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని రామచెరువులో శుక్రవారం టన్నుల కొద్దీ చేపలు మృతి చెందడం కలకలం రేపింది.

ఈ ఘటనకు ఫ్యాక్టరీల నుంచి వచ్చిన కెమికల్ వ్యర్థాలే కారణం కావచ్చని మత్స్యకారులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, చేపల మృతికి అసలు కారణం ఏమిటనేది అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదు. చేపలు భారీగా మృతి చెందడంతో రామచెరువు పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. సుమారు అర కిలోమీటర్‌ మేర దుర్వాసనతో చెరువు సమీపంలో నివసించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేపల మృతిపై సమాచారం అందడంతో హైడ్రా అధికారులు శనివారం రామచెరువును పరిశీలించారు.

హైడ్రా ఎన్విరాన్‌మెంటల్‌ సైంటిస్ట్‌ శ్రీవల్లి చెరువును సందర్శించి వివిధ ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించారు. అనంతరం చెరువు సమీపంలోని సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ)ని కూడా పరిశీలించారు. ప్రాథమికంగా చెరువు నీటిలో పీహెచ్‌, టీడీఎస్‌ స్థాయిలపై అనుమానాలు ఉన్నట్లు మత్స్యకార సంఘం ప్రతినిధులు తెలిపారు. అయితే అధికారిక పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే చేపల మృతికి అసలు కారణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, చేపల మృతితో తమకు భారీ నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చేపల మృతిపై సమగ్ర విచారణ చేపట్టడంతో పాటు, చెరువులోకి కలుషిత జలాలు చేరకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని.. మృతి చెందిన చేపలను తొలగించి, చెరువు నీటిని శుద్ధి చేయాలని కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News