Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్యాంకింగ్ వ్యవస్థలో మరో కీలక మార్పు.. 2026 కొత్త బిల్లు ఏమిటి?

బ్యాంకింగ్ వ్యవస్థలో మరో కీలక మార్పు.. 2026 కొత్త బిల్లు ఏమిటి?

V6 Velugu 2 days ago

దేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ బ్యాంకింగ్‌కు అనుగుణంగా చట్టాలను ఆధునీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్-2026ను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.

బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రస్తుతం ఎక్కువ లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్న నేపథ్యంలో, పాత చట్టాలను సవరించి కొత్త సాంకేతిక అవసరాలకు అనుగుణంగా చట్టబద్ధ వ్యవస్థను రూపొందించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం.

ప్రస్తుతం అమల్లో ఉన్న బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ చట్టం-1891 బ్యాంకు రికార్డులు ప్రధానంగా కాగితాల రూపంలో నిర్వహించే కాలంలో రూపొందించబడింది. అయితే ప్రస్తుతం బ్యాంకింగ్ సేవలు డిజిటల్ రూపంలోకి మారిపోయాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొత్త బిల్లులో బ్యాంకర్స్ బుక్స్ నిర్వచనాన్ని విస్తరించారు. ఇకపై కాగితపు రికార్డులతో పాటు ఎలక్ట్రానిక్, డిజిటల్, వర్చువల్, క్లౌడ్ ఆధారిత సిస్టమ్‌లు లేదా ఇతర సాంకేతిక రూపాల్లో భద్రపరిచిన బ్యాంకు రికార్డులన్నీ కూడా చట్టపరంగా గుర్తింపు పొందనున్నాయి.

కొత్త బిల్లులో మరో కీలక అంశం ఏమిటంటే, డిజిటల్ బ్యాంకింగ్ రికార్డులను కోర్టులు, ఇతర న్యాయ సంస్థల్లో సాక్ష్యాలుగా సమర్పించేందుకు స్పష్టమైన నిబంధనలు తీసుకురానున్నారు. ఇందుకోసం బ్యాంకు రికార్డుల సర్టిఫికేషన్ ప్రక్రియను ఒకే విధంగా అమలు చేసేలా ప్రమాణాలను నిర్ణయించనున్నారు. బిల్లులో పేర్కొన్న నిబంధనలు పాటిస్తే ఎలక్ట్రానిక్ రికార్డులు కూడా చట్టబద్ధ సాక్ష్యాలుగా పరిగణించబడతాయి.

అంతేకాకుండా, బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే ఇతర సంస్థలకు కూడా ఈ చట్టాన్ని వర్తింపజేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు కల్పిస్తోంది. అవసరమైతే అదనపు ధ్రువీకరణ నిబంధనలను కూడా కేంద్రం నోటిఫికేషన్ ద్వారా ప్రకటించవచ్చు. దీంతో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థలో రికార్డుల ప్రామాణికత, భద్రత మరింత బలపడే అవకాశం ఉంది.

డిజిటల్ లావాదేవీలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, బ్యాంకింగ్ రంగానికి భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన చట్టబద్ధ రక్షణ కల్పించడమే ఈ బిల్లు లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్ రికార్డులకు చట్టపరమైన గుర్తింపు రావడం వల్ల కోర్టు కేసులు, దర్యాప్తులు, ఆర్థిక వివాదాల్లో బ్యాంకు సమాచారం వినియోగించడం మరింత సులభం, పారదర్శకంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News