షెన్‌జెన్: ఇండియా స్టార్ షట్లర్ లక్ష్య సేన్.. చైనా మాస్టర్స్ సూపర్-750 టోర్నీలో నిరాశపర్చాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో లక్ష్య 14-21, 7-21తో విక్టర్ లాయ్ (కెనడా) చేతిలో ఓడాడు.
ఫలితంగా కెనడా ప్లేయర్ చేతిలో లక్ష్య ఓడటం ఇది మూడోసారి. ఈ ఏడాది జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో మాత్రమే విజయం సాధించాడు.
38 నిమిషాల మ్యాచ్‌లో లక్ష్య ఎండ్ గేమ్‌లో తడబడ్డాడు. తొలి గేమ్‌లో 8-8 స్కోరు తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోయాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థి జోరుకు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోయాడు. బలమైన స్మాష్‌లు, ర్యాలీలతో రెచ్చిపోయిన లాయ్ స్కోరు 2-2 తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
మరో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 21-16, 21-15తో చి యు జెన్ (చైనీస్‌తైపీ)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. విమెన్స్ సింగిల్స్‌లో తన్వీ శర్మ 21-16, 21-17తో అమెలీ షుల్జ్ (డెన్మార్క్)పై గెలిచింది. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ షెట్టి 21-11, 21-16తో జునైద్ ఆరిఫ్-కాంగ్ ఖాయ్ జింగ్ (మలేసియా)పై, మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తానీషా క్రాస్టో 21-8, 21-9తో టోనాకార్న్ సెహాంగ్-టోనిచా సెహాంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచారు. దేవిక సిహాగ్ 18-21, 15-21తో కలోయనా నల్బంటోవా (బల్గేరియా) చేతిలో, మిక్స్‌డ్‌లో రోహన్ కపూర్-రుత్విక శివాని 16-21, 18-21తో వుయ్ గువాన్ జున్-లీ చియా సిన్ (చైనీస్‌తైపీ) చేతిలో ఓడారు.

