Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చేజారిన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు..బొగ్గు బావులున్నా తెలంగాణకు దక్కని అవకాశం

చేజారిన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు..బొగ్గు బావులున్నా తెలంగాణకు దక్కని అవకాశం

V6 Velugu 1 week ago
  • రూ.లక్ష కోట్లతో ఏపీలో ఏర్పాటు
  • వేలంలో ప్రాజెక్టును దక్కించుకున్న రిలయన్స్​ ఇండస్ట్రీస్​

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఏపీలో అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది.

కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన సంస్థ ఏలూరు జిల్లాలోని చింతలపూడి సెక్టార్-1, రేచెర్ల కోల్ బ్లాకులను దక్కించుకుంది. సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడితో భూగర్భంలోని బొగ్గును గ్యాస్‌గా మార్చే ప్రాజెక్టును ఏర్పాటు చేసి, 2029 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కోల్ గ్యాసిఫికేషన్ అంటే బొగ్గును నేరుగా కాల్చకుండా అధిక ఉష్ణోగ్రత, నియంత్రిత ఆక్సిజన్ లేదా ఆవిరి సాయంతో సింథటిక్ గ్యాస్‌గా మార్చే ప్రక్రియ. ఈ గ్యాస్‌ను ఎరువులు, మెథనాల్, హైడ్రోజన్, విద్యుత్ ఉత్పత్తి, రసాయన పరిశ్రమల్లో వినియోగిస్తారు. ప్రస్తుతం దేశంలో ఒడిశాలోని జిందాల్ స్టీల్, తాల్చేర్ ఫెర్టిలైజర్స్ వద్ద కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి.

తెలంగాణలో ఇంకా ప్రణాళికల దశలోనే..

ఏపీలో బొగ్గు బాయిల తవ్వకాలు లేవు. తెలంగాణలో 130 ఏళ్లకు పైగా బొగ్గు తవ్వకాలు జరుగుతున్నప్పటికీ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఇప్పటికీ ప్రణాళికల దశలోనే ఉంది. సింగరేణి సంస్థ ఈ ప్రాజెక్టు ఏర్పాటుపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. తొలి ప్రాజెక్టు తెలంగాణలోనే వస్తుందని భావించిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ ప్రాజెక్టు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో కోల్ గ్యాసిఫికేషన్‌పై ప్రత్యేక సమావేశం, రోడ్‌షో కూడా నిర్వహించారు. తెలంగాణలో బెల్లంపల్లి ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది.

ప్లాంట్​ వస్తే ఉపాధి..

రోజుకు వెయ్యి టన్నుల బొగ్గును గ్యాసిఫై చేసే ప్లాంటుకు సుమారు 100 ఎకరాల భూమి, రోజుకు 3-6 మిలియన్ లీటర్ల నీరు, 20-40 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. ఇందుకు సుమారు రూ.4 వేల కోట్ల పెట్టుబడి అవసరమవుతుంది. ఏడాదికి 3.65 లక్షల టన్నుల బొగ్గు వినియోగం ఉండగా, సుమారు 500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించే అవకాశం ఉంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్‌తో పాటు ఆక్సిజన్, గ్యాస్, నీటి శుద్ధి ప్లాంట్లు, స్టోరేజ్​ ట్యాంకులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో రామగుండం, మణుగూరు, కొత్తగూడెం, భూపాలపల్లి ప్రాంతాలు ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News