Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
E20 పెట్రోల్ తయారీతో 40% పెరిగిన గుడ్ల రేట్లు.. పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఇథనాల్‌కి మధ్య లింకేంటి?

E20 పెట్రోల్ తయారీతో 40% పెరిగిన గుడ్ల రేట్లు.. పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఇథనాల్‌కి మధ్య లింకేంటి?

V6 Velugu 1 week ago

సామాన్యుల పౌష్టికాహారానికి ప్రత్యామ్నాయంగా నిలిచే కోడిగుడ్డు ధర ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. ఉదయాన్నే ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఒక ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్ కోసం జేబుకు చిల్లులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒకప్పుడు సామాన్యుడికి అతి తక్కువ ధరలో దొరికే ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ ఇప్పుడు క్రమంగా ఖరీదైపోతోంది. దేశంలో గత ఏడాది కాలంగా కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రానున్న శీతాకాలంలో ఈ ధరలు మరింత భగ్గుమనే అవకాశం ఉందని పౌల్ట్రీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ రిపోర్ట్స్ ప్రకారం.. గత ఏడాది కాలంలో గుడ్ల ధరలు ఏకంగా 35 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగాయి. ప్రస్తుతం ఫామ్ వద్ద గుడ్డు ధర రూ.7 వరకు పలుకుతుండగా.. వినియోగదారులు రిటైల్ మార్కెట్లో రూ.8.50 నుంచి రూ.9 వరకు చెల్లించాల్సి వస్తోంది. సాధారణంగా శీతాకాలంలో గుడ్ల వినియోగం భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా.

ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కోళ్ల దాణా తయారీలో అత్యంత కీలకమైన మొక్కజొన్నల కొరత, ధరల పెరుగుదలే. దేశంలో ఇథనాల్ ఉత్పత్తి కోసం మొక్కజొన్నలను మోడీ సర్కార్ తరలించటం దీనికి అసలు కారణం. పౌల్ట్రీ పరిశ్రమకు కావాల్సిన మొక్కజొన్నల్లో సుమారు 37 శాతం ఇప్పుడు ఇథనాల్ డిస్టిలరీలకే తరలిపోతున్నాయి. దీంతో 3 ఏళ్ల క్రితం టన్ను మొక్కజొన్నల ధర రూ.14వేలు ఉండగా.. ప్రస్తుతం అది రూ.26వేల 500కి చేరింది. కోళ్ల పెంపుడు ఖర్చులో దాదాపు 65 నుంచి 70 శాతం కేవలం ఈ దాణా ఖర్చే కావడంతో రైతులపై తీవ్ర భారం పడుతోంది.

పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌ను 20 శాతానికి పెంచాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయంతో మొక్కజొన్నలతో ఇథనాల్ ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. 2022లో కేవలం 1 మిలియన్ టన్నులుగా ఉన్న ఈ ఉత్పత్తి.. ఇప్పుడు సుమారు 17 మిలియన్ టన్నులకు చేరింది. 2030 నాటికి ఇది 25 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని అంచనా. ఇథనాల్ డిమాండ్ కారణంగా పౌల్ట్రీ రంగానికి ముడిసరుకు కొరత ఏర్పడుతోంది. అయితే ఒక్క ఇథనాల్ మాత్రమే కాకుండా తీవ్రమైన వడగాలులు, వాతావరణ మార్పులు, దిగుమతి చేసుకునే దాణా ముడిసరకు ధరలు కూడా పౌల్ట్రీ వ్యయాన్ని పెంచుతున్నాయని తేలింది.

గుడ్లతో పాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలు కూడా సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో ఉల్లిపాయల ధర కిలో రూ.50 నుంచి రూ.60 వరకు పలుకుతుండగా.. కేంద్ర ప్రభుత్వం రూ. 35కే రాయితీపై అమ్ముతోంది. అలాగే జూలైలో రూ.70 ఉన్న బెల్లం ధర ప్రస్తుతం రూ.90 నుంచి రూ.100కి చేరుకుంది. మొత్తానికి రోజువారీ కూలీలు, మధ్యతరగతి ప్రజలు ఇష్టంగా తినే కోడిగుడ్డు ఇప్పుడు భారంగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇథనాల్ తయారీ దెబ్బకు చక్కర, బెల్లం తర్వాత ఇప్పుడు కోడిగుడ్డు కూడా ఖరీదుగా మారటంతో ఏం తినాలి ఎలా బతకాలి అంటున్నారు సామాన్య మధ్యతరగతి ప్రజలు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News