Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎమ్మెల్సీ రహ్మత్‌ బేగ్‌పై వేటు..పార్టీ నుంచి సస్పెన్షన్, పదవికి రిజైన్ చేయాలని ఎంఐఎం ఆదేశం

ఎమ్మెల్సీ రహ్మత్‌ బేగ్‌పై వేటు..పార్టీ నుంచి సస్పెన్షన్, పదవికి రిజైన్ చేయాలని ఎంఐఎం ఆదేశం

V6 Velugu 6 days ago

హైదరాబాద్, వెలుగు: ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌పై ఆ పార్టీ హైకమాండ్ కఠిన చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది.

లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలోనే బేగ్‌పై ఆ పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 2023లో ఎమ్మెల్సీగా ఎన్నికైన రహ్మత్‌ బేగ్‌ పదవీకాలం 2029 మే వరకు ఉన్నప్పటికీ.. పార్టీ నిర్ణయంతో మధ్యలోనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. బేగ్ ఇప్పటివరకు తన పదవికి రాజీనామా చేయకపోవడం గమనార్హం.

లైంగిక ఆరోపణల నేపథ్యంలోనే చర్యలు?

ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ నాలుగు రోజుల కింద అత్తాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మైనర్ పై లైంగిక దాడికి యత్నిస్తూ రెడ్ హ్యాడెండ్‌గా పట్టబడినట్లు ఆరోపణలు వచ్చాయి. మైనర్‌పై దాడికి యత్నిస్తున్న రహ్మత్‌ బేగ్‌ను కొందరు యువకులు పట్టుకున్నారని, అనంతరం ఆయనపై దాడి చేసి వీడియోలు తీశారని ప్రచారం జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

మరో వైపు ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ తనపై డీప్ ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలు సృష్టిస్తున్నారని, వారిపై చర్య తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ ఘటనపై నివేదిక తెప్పించుకున్న మజ్లిస్​పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. దాడి ఘటన వాస్తవమేనని నిర్ధారించి నోటీసు ఇవ్వకుండా, వివరణ అడగకుండానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారని తెలుస్తోంది.

ఆరోపణలను ఖండించిన రహ్మత్‌ బేగ్

తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్ ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలను ఏఐ ద్వారా రూపొందించారని, ఈ విషయంపై ఆగస్టు 26నే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కొంతమంది ఉద్దేశపూర్వకంగా తనను, ఎంఐఎం పార్టీని డిఫేమ్ చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

అసదుద్దీన్ సమాధానం చెప్పాలి: రాజాసింగ్

రహ్మత్ బేగ్ వ్యవహారంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సమాధానం చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీని అర్ధరాత్రి పిలిపించి చర్యలు తీసుకోవడం వెనుక అసలు కారణమేంటో ప్రజలకు వివరించాలన్నారు. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే అసదుద్దీన్.. తన పార్టీ ఎమ్మెల్సీపై వచ్చిన ఆరోపణల విషయంలో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఈ అంశంపై ప్రజలకు వాస్తవాలు వెల్లడించాల్సిన బాధ్యత ఆ పార్టీ హైకమాండ్‌పై ఉందన్నారు.

మరో నలుగురిపై చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్ యూత్ కరేజ్‌కు చెందిన సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. రహ్మత్‌ బేగ్‌ వ్యవహారంపై తాను అసదుద్దీన్ ఒవైసీకి సమాచారం ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకున్నారని చెప్పారు. రహ్మత్‌ బేగ్‌ పైనే కాకుండా.. ఆయనకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నలుగురిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News