Dailyhunt
'గౌరవెల్లి' భూసేకరణ స్పీడప్

'గౌరవెల్లి' భూసేకరణ స్పీడప్

V6 Velugu 3 weeks ago
  • హనుమకొండ జిల్లాలో డీ5 కెనాల్ విస్తరణకు చర్యలు
  • భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో 267 ఎకరాలు అవసరం
  • ఇప్పటివరకు 190.19 ఎకరాలు అవార్డ్ చేసిన అధికారులు
  • 105 ఎకరాలకు రూ.15.3 కోట్ల పరిహారం చెల్లింపు
  • ప్రక్రియ పూర్తయితే జిల్లాలో 22 వేల ఎకరాలకు సాగునీరు

హనుమకొండ/ భీమదేవరపల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను స్పీడప్ చేసింది. ప్రాజెక్టుకు చెందిన డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు డీ5-1ఆర్, డీ5-2ఎల్ ద్వారా హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, వేలేరు మండలాలకు సాగునీరు అందనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో అధికారులు భూసేకరణ పనులను చివరి దశకు తీసుకువచ్చారు. ఇప్పటివరకు దాదాపు 70 శాతం భూమిని సేకరించగా, రైతుల ఖాతాల్లో పరిహారం కూడా జమ చేశారు. పనులు పూర్తయితే ఈ రెండు మండలాల్లో 22 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశం ఉంది.

ల్యాండ్ అక్విజిషన్‌పై స్పెషల్ ఫోకస్..

గౌరవెల్లి ప్రాజెక్టుకు 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మొదట 1.43 టీఎంసీల సామర్థ్యంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో రీడిజైన్ చేసి కెపాసిటీని 8.23 టీఎంసీలకు పెంచారు. అయితే కాల్వల నిర్మాణంలో గత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో పనులు నెమ్మదించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టు పూర్తయితే హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 57,852 ఎకరాలకు సాగునీరు అందనుంది. అందులో డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు డీ5-1ఆర్, డీ5-2ఎల్ ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో 10,508 ఎకరాలు, వేలేరు మండలంలో 11,714 ఎకరాలు మొత్తంగా 22,222 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. కాల్వ ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరించేందుకు ఆర్డీవో రమేశ్ రాథోడ్, ఇతర ఆఫీసర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు.

ఎకరాకు రూ.18 లక్షల పరిహారం..

డీ5-1ఆర్, డీ5-2ఎల్ కాల్వల నిర్మాణానికి హనుమకొండ జిల్లాలో మొత్తం 267.21 ఎకరాల భూమి అవసరం ఉంది. ఇందులో భీమదేవరపల్లి మండలంలో 210.21 ఎకరాలు, వేలేరు మండలంలో 57 ఎకరాలు ఉన్నాయి. భూమి సేకరణ కోసం ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. రైతులు మొదట ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పరిహారం డిమాండ్ చేయగా, అధికారులు మార్కెట్ విలువ ఆధారంగా ఎకరాకు రూ.18 లక్షల పరిహారం నిర్ణయించారు. ఈ మేరకు అవార్డు ప్రకటన సమావేశాలు కూడా నిర్వహించారు.

70 శాతం భూసేకరణ పూర్తి..

ఇప్పటివరకు 267.21 ఎకరాల్లో 190.19 ఎకరాల భూమిని అధికారులు అవార్డు చేశారు. భూసేకరణ కోసం మంజూరైన నిధుల్లో నుంచి 288 మంది రైతులకు చెందిన 105 ఎకరాల భూమికి రూ.15.33 కోట్ల పరిహారం వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 77 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, కొంతమంది రైతులు ఎక్కువ పరిహారం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ త్వరలోనే మిగతా భూసేకరణను పూర్తి చేస్తామని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News