Dailyhunt
గ్రేటర్ ఆర్టీసీలో 'ఆప్షన్'ల లొల్లి! 8వేల మంది సిబ్బందిపై ఎలక్ట్రిక్ బస్సుల ఎఫెక్ట్

గ్రేటర్ ఆర్టీసీలో 'ఆప్షన్'ల లొల్లి! 8వేల మంది సిబ్బందిపై ఎలక్ట్రిక్ బస్సుల ఎఫెక్ట్

V6 Velugu 1 week ago
  • ఆప్షన్లు ఇచ్చేందుకు ఏప్రిల్ 15 వరకు గడువు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ లో ఎలక్ట్రిక్ బస్సులు పెరుగుతుండడంతో ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్‌లు, హెల్పర్లు, శ్రామికులకు కష్టాలు మొదలయ్యాయి.

కండక్టర్లు మినహా మిగతా ఉద్యోగులందరూ ఈవీ సంస్థ నుంచే ఉంటున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులకు పని లేకుండా పోతోంది.

ఈ నేపథ్యంలో సిటీ ఆర్టీసీ పరిధిలో పని చేస్తున్న కార్మికులందరికీ వారి విద్యార్హతల ఆధారంగా కండక్టర్లుగా అవకాశం కల్పించాలని యాజమాన్యం నిర్ణయించింది. మిగిలినవారు హైదరాబాద్ వదిలి వేరే జోన్​లో ఉద్యోగాలు కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 15వ తేదీలోగా కార్మికులు తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ అధికారులకు లేఖలు సమర్పించాలని స్పష్టంచేసింది.

  • ఆందోళనలో 8 వేల మంది కార్మికులు

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 300 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. రాబోయే రెండేండ్లలో దశలవారీగా మరో 2,500 బస్సులు వస్తాయని యాజమాన్యం చెబుతోంది. ఆర్టీసీ హైదరాబాద్​ పరిధిలో ప్రస్తుతం 8 వేల మంది డ్రైవర్లు, మెకానిక్‌లు, హెల్పర్లు, శ్రామికులు పనిచేస్తున్నారు.

ఇంత మందిని ఒక్కసారిగా ఆప్షన్లు పెట్టుకోమని యాజమాన్యం ఆదేశించడంతో కార్మికులు గందరగోళంలో పడ్డారు. పదో తరగతి లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారికి ఇక్కడే కండక్టర్లుగా ఆప్షన్​ఇచ్చే అవకాశం ఉంది. అంతకన్నా తక్కువ విద్యార్హత ఉన్న కార్మికుల పరిస్థితి మాత్రం గందరగోళంగా మారింది. వారు హైదరాబాద్ జోన్ వదిలి కరీంనగర్ జోన్ పరిధిలోకి మారాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ కార్మికులంతా హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాలవారే. ​దశాబ్దాలుగా తమ కుటుంబాలతో హైదరాబాద్​లో నివాసముంటున్నారు.

ఇప్పటికిప్పుడు కరీంనగర్​ జోన్​లోకి మారాలంటే కష్టాలు తప్పవని వాపోతున్నారు. మరోవైపు దశలవారీగా వచ్చే బస్సుల కోసం అందరి నుంచి ఒక్కసారే ఆప్షన్లు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని కార్మికులు అంటున్నారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలపై నిషేధం ఉండడంతో వీరి తరుపున మాట్లాడే వాయిస్​ లేకుండా పోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News