Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుర్తింపు సంఘం ఎన్నికలు కొత్త పద్ధతిలోనా.. పాత పద్ధతిలోనా? సింగరేణిలో సంఘం గడువుపై రగడ

గుర్తింపు సంఘం ఎన్నికలు కొత్త పద్ధతిలోనా.. పాత పద్ధతిలోనా? సింగరేణిలో సంఘం గడువుపై రగడ

V6 Velugu 1 week ago
  • పది రోజుల్లో ముగియనున్న కాలపరిమితి
  • కొత్త లేబర్​ కోడ్​ల ప్రకారం 51 శాతం ఓట్లు వస్తేనే గుర్తింపు సంఘం హోదా
  • ప్రచారం ప్రారంభించిన సంఘాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితిపై రగడ మొదలైంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్‌ కోడ్‌ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలా? లేక పాత పద్ధతిలోనే జరపాలా? అనే సందిగ్ధత నెలకొంది. కొత్త లేబర్‌ కోడ్‌ల ప్రకారం ఎన్నికలు జరిగితే 51 శాతం ఓట్లు సాధించిన సంఘానికే గుర్తింపు లభిస్తుంది.

21 శాతం ఓట్లు వచ్చిన సంఘాలు ప్రాతినిధ్య సంఘాలుగా కొనసాగుతాయి. మరోవైపు సింగరేణిలో పట్టు సాధిస్తే ఉత్తర, మధ్య తెలంగాణలో రాజకీయంగా బలం పెంచుకోవచ్చని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రస్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘంగా ఉన్న ఐఎన్‌టీయూసీ కాలపరిమితి మరో పది రోజుల్లో ముగియనుంది.

గతంలో టీబీజీకేఎస్‌ ఆరేండ్ల పాటు గుర్తింపు సంఘంగా కొనసాగిందని, అదే విధంగా తాము కూడా కొనసాగుతామని ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నేతలు చెబుతున్నారు. అయితే రెండేండ్ల కాలపరిమితితోనే గత ఎన్నికలు జరిగాయని టీబీజీకేఎస్‌, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కొన్ని సంఘాలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని సింగరేణి అధికారులు చెబుతున్నారు.

రెండేండ్లా.. నాలుగేండ్లా?

2023 డిసెంబర్‌ 27న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) గుర్తింపు సంఘంగా, ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా గెలిచాయి. అయితే ఏఐటీయూసీ గుర్తింపు సర్టిఫికెట్‌ను 2024 సెప్టెంబర్‌ 9న తీసుకుంది. ఆ లెక్కన వచ్చే నెల 9తో గడువు ముగియనుంది.

గతంలో టీబీజీకేఎస్‌ ఆరేండ్ల పాటు గుర్తింపు సంఘంగా కొనసాగిందని, తాము నాలుగేండ్ల వరకు కొనసాగుతామని ప్రస్తుత గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నేతలు చెబుతున్నారు. అయితే ఎన్నికలకు ముందు డిప్యూటీ ఆర్‌ఎల్‌సీ వద్ద జరిగిన చర్చల్లో ఈసారి గుర్తింపు కాలపరిమితి రెండేండ్లేనని స్పష్టం చేయగా, యూనియన్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు జరుగుతాయా? లేక నాలుగేండ్ల కాలపరిమితి కొనసాగుతుందా? అనే ఉత్కంఠ కార్మికుల్లో నెలకొంది.

యూనియన్ల బొగ్గుబాయి బాట..

గుర్తింపు సంఘం గడువు ముగియనుండటంతో యూనియన్లలో కదలిక మొదలైంది. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్‌, టీబీజీకేఎస్‌, హెచ్‌ఎంఎస్‌ తదితర సంఘాలు ఇప్పటికే బొగ్గు బాయిల బాట పట్టాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా సింగరేణి పరిరక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం, డిపెండెంట్‌ ఎంప్లాయ్‌మెంట్‌, సొంతింటి కల, లాభాల్లో వాటా, బకాయిల చెల్లింపులు తదితర అంశాలపై పరోక్షంగా ప్రచారం చేస్తున్నాయి. రెండేండ్ల కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని టీబీజీకేఎస్‌, హెచ్‌ఎంఎస్‌ ఇప్పటికే కోర్టును ఆశ్రయించాయి. సీఐటీయూ కూడా ఇంప్లీడ్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతో గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు జరుగుతాయా? లేక ప్రస్తుత సంఘాల కాలపరిమితి కొనసాగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

కొత్త లేబర్‌ కోడ్‌ల అమలుపై చర్చ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌ల ప్రకారం సింగరేణిలో ఎన్నికలు జరుగుతాయా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు ఎక్కువ ఓట్లు సాధించిన సంఘాన్ని గుర్తింపు సంఘంగా, ఆ తర్వాత స్థానంలో ఉన్న యూనియన్‌ను ప్రాతినిధ్య సంఘంగా గుర్తిస్తున్నారు. కొత్త లేబర్‌ కోడ్‌లు అమలైతే 51 శాతం ఓట్లు సాధించిన సంఘానికే గుర్తింపు లభిస్తుంది. కనీసం 21 శాతం ఓట్లు సాధించిన సంఘానికి ప్రాతినిధ్య హోదా దక్కుతుంది.

సింగరేణిలో 51 శాతం ఓట్లు సాధించడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమని పలు యూనియన్ల నేతలు అభిప్రాయపడుతున్నారు. బొగ్గు పరిశ్రమల్లో కొత్త లేబర్‌ కోడ్‌లు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని చెబుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగితే బొగ్గు పరిశ్రమల్లో సింగరేణిదే తొలి ఎన్నిక అయ్యే అవకాశం ఉంది.

పార్టీలకు ప్రతిష్టాత్మకం..

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్‌ తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఒక దశ ప్రచారం నిర్వహించారు. బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి సింగరేణి ప్రాంతాల్లో పర్యటించారు.

బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ మంత్రి హరీశ్‌రావు సింగరేణి ప్రాంతాల్లో పర్యటించారు. హెచ్‌ఎంఎస్‌ తరఫున తెలంగాణ రక్షణ సేన పేరుతో కల్వకుంట్ల కవిత 'బాయి బాట' కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మిక సమస్యల పరిష్కారాన్ని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News