- ఎఫ్‌ఎస్‌యూఐ వెల్లడి
న్యూఢిల్లీ: భారత్‌కు వస్తున్న ఎమ్‌వీ కేప్ డావో నౌకపై జరిగిన టార్పిడో దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన నావికుడు సూరజ్ యాదవ్ ప్రాణాలు కోల్పోయారు.
ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌యూఐ) ఈ విషయాన్ని వెల్లడించింది. యూపీలోని డియోరియా జిల్లాకు చెందిన సూరజ్ యాదవ్.. ఈ నౌకలో వైపర్‌గా విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. నౌకపై రెండు టార్పిడోలతో దాడులు జరిగినట్టు ఎఫ్‌ఎస్‌యూఐ పేర్కొంది.
మొదటి టార్పిడో సిబ్బంది నివాస ప్రాంతాలుండే పోర్ట్ సైడ్ సీ-డెక్‌ను, రెండవ టార్పిడో ఇంజిన్ రూమ్ సమీపంలోని పోర్ట్ సైడ్ హల్‌ను బలంగా తాకినట్టు చెప్పింది. ఈ నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా, వారిలో 20 మంది భారతీయ పౌరులే కావడం గమనార్హం. ఈ ప్రాంతంలో నావికుల భద్రతకు ఇస్తున్న హామీలన్నీ ఒట్టి మాటలేనని తేలిపోయిందని ఎఫ్‌ఎస్‌యూఐ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
హార్మూజ్ పరిసర ప్రాంతాల్లో అమాయక నావికులను పొట్టనబెట్టుకుంటున్నారని యూనియన్ మండిపడింది. ఈ ఘటనపై బాధ్యులు తక్షణమే వివరణ ఇవ్వాలని, ఈ ప్రాంతం గుండా వెళ్లే నావికులకు సురక్షితమైన మార్గం కల్పించాలని డిమాండ్ చేసింది. అలాగే, మృతి చెందిన సూరజ్ యాదవ్‌కు న్యాయం చేయడంతో పాటు, ప్రాణాపాయంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ నావికుడికి రక్షణ కల్పించాలని కోరింది.

