Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్: ఆరెకరాల స్థలాన్ని కాపాడండి.. ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు

హైదరాబాద్: ఆరెకరాల స్థలాన్ని కాపాడండి.. ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు

V6 Velugu 1 week ago

హైదరాబాద్ సిటీ, వెలుగు : హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 52 ఫిర్యాదులు రాగా, హైడ్రా చీఫ్​రంగనాథ్​ స్వీకరించారు. హయత్‌నగర్ రాజరాజేశ్వరి కాలనీ ఫేజ్--2 లోని సర్వే నంబర్ 189/1లో 1983లో ఆమోదం పొందిన లేఅవుట్‌లో పార్కు కోసం కేటాయించిన ఆరెకరాలను కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది.

అమీన్‌పూర్ పెద్ద చెరువు పరిధిలోని 50 సర్వే నంబర్లలో 20 వరకు లేఅవుట్లు మునిగిపోయాయని, ఆ ప్రాంతంలోని ప్లాట్ల యజమానులకు టీడీఆర్ ద్వారా నష్టపరిహారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. బేగంపేట మెథడిస్ట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ..వర్షపు నీటి కాలువను అండర్ డ్రైనేజీ పైప్‌లైన్‌గా మార్చి, దానిపై 8 అడుగుల మేర ఎత్తు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు.

నాలాలో చెత్త వేసే వారిపై చర్యలు : రంగనాథ్

షేక్‌పేట్‌లోని హకీంషా విరాట్‌నగర్‌లోని నాలాలో చెత్త వేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఓయూ కాలనీ నుంచి బృందావన్ కాలనీ వరకు నాలా పొడవునా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచాలని, కాలువలో చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక సంక్షేమ సంఘాలు కూడా బాధ్యత వహించాలని సూచించారు. జేసీబీల సహాయంతో రెండు మూడు రోజుల్లోనే కాలువలోని చెత్తను, పూడికను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు.

విధులకు హాజరైన హైడ్రా చీఫ్ రంగనాథ్

  • కోర్టు తీర్పు తర్వాత డ్యూటీకి..

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వారం రోజుల సెలవు తర్వాత సోమవారం తిరిగి విధులకు హాజరయ్యారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజావాణిలో పాల్గొన్నారు. ఆ తర్వాత షేక్ పేట్ లో నాలాను పరిశీలించారు. కోర్టు ధిక్కరణ కేసులకు సంబంధించి తీర్పు వచ్చాక ఆయన సెలవుపై వెళ్లారు. సీఎస్​కు రంగనాథ్​ను మార్చాలంటూ హైకోర్టు సీఎస్​కు సూచన చేయడంతో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందా అన్న ఉత్కంఠ నెలకొన్నది.

అయితే, సీఎం రేవంత్ రెడ్డి స్పందించి న్యాయవ్యవస్థపై తమకు అపారమైన విశ్వాసం ఉందని, అయితే అధికారులు ఎక్కడ పని చేయాలనే విచక్షణ ప్రభుత్వ పరిధిలోని అంశమని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుపై నిపుణుల సలహా మేరకు అప్పీల్​కు వెళ్లే అంశాన్ని పరిశీలించాలని సీఎస్​కు సూచించారు. హైడ్రా చీఫ్​రంగనాథ్​కు సర్కారు అండగా నిలవడంతో ఆయన లీవ్​ ముగించుకుని సోమవారం డ్యూటీలో జాయిన్​ అయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News