Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ జీవనాడి పునరుజ్జీవం కావాలి.. మూసీ నదిలో  కాలుష్యం.. దుర్వాసన

హైదరాబాద్ జీవనాడి పునరుజ్జీవం కావాలి.. మూసీ నదిలో కాలుష్యం.. దుర్వాసన

V6 Velugu 3 weeks ago

కప్పుడు భాగ్యనగర వికాసానికి మూలాధారమైనది మూసీ నది. నేడు దుర్వాసనకు, కాలుష్యానికి, నిర్లక్ష్యానికి ప్రతీకగా మారిపోయింది. అందుకే ప్రస్తుతం జరుగుతున్న మూసీ పునరుజ్జీవన చర్చను కేవలం ఒక ప్రభుత్వ పథకంగా, రాజకీయ వివాదంగా కాకుండా, హైదరాబాద్ చరిత్రను, సంస్కృతిని, పర్యావరణాన్ని, భవిష్యత్తును స్పృశించే అంశంగా చూడాలి.

ఈ నదికి ఒకప్పుడు పురాణాల్లో ప్రసిద్ధి చెందిన సూర్యవంశ రాజు ముచుకుందుని పేరుమీదుగా 'ముచుకుంద' అనే పేరు ఉండేదని, తరువాత అదే 'ముసునూరు', ఆపై 'మూసీ'గా పరిణామం చెందిందనేది ఒక అభిప్రాయం.

అనంతగిరి కొండల్లో పుట్టిన 'మూసా', 'ఈసి' అనే రెండు ప్రవాహాలు లంగర్‌హౌస్ ప్రాంతంలోని బాపూఘాట్ వద్ద కలవడం వల్ల వాటి పేర్లతోనే 'మూసీ' అనే పేరు వచ్చిందని మరికొందరు చెబుతుంటారు. ఏ వివరణను స్వీకరించినా క్రీ.శ. 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని స్థాపించేనాటికే ఈ నది 'మూసీ' అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.

భద్రత, తాగునీటి లభ్యత, వ్యవసాయం, వాణిజ్యం, భవిష్యత్తులో నగర విస్తరణకు అనుకూలత వంటి అంశాల కారణంగా ఈ నది ఒడ్డున హైదరాబాద్ ఆవిర్భవించింది. ఆ తరువాత క్రమంగా దక్కను పీఠభూమిలోనే అత్యంత సంపన్నమైన, సాంస్కృతిక వైభవంతో వెలుగొందిన రాజధానులలో ఒకటిగా పేరొందింది.

మూసీ నగరానికి తాగునీటితోపాటు పరిసర ప్రాంతాలకు సాగునీటిని కూడా అందిస్తూ, భూగర్భ జలాలను సమృద్ధిగా ఉంచి వ్యవసాయాభివృద్ధికి జీవనాడిగా నిలిచింది. హైదరాబాద్ చరిత్ర లోతులను, దాని అభివృద్ధిలో మూసీ పోషించిన పాత్రను అవగతం చేసుకోకుండా నేటి మూసీ పునరుజ్జీవన ప్రణాళికను సమగ్రంగా అర్థం చేసుకోవడం అసాధ్యం.

కాలుష్యం మానవ నిర్లక్ష్యానికి నిదర్శనం

వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండల్లో పుట్టి సుమారు 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణమ్మ ఒడిలో సేదతీరే ఈ నది.. తన ప్రయాణంలో వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలను స్పృశిస్తూ తెలంగాణ భౌగోళిక, ఆర్థిక, సామాజిక జీవితాలతో మమేకమైంది.

శతాబ్దాలపాటు హైదరాబాద్‌కు జీవనాడిగా నిలిచిన మూసీ జీవనగమనం ఇరవయ్యో శతాబ్దం ద్వితీయార్థంలో అనూహ్యమైన మలుపు తిరిగింది. జనాభా వేగంగా పెరగడం, నగరం విస్తరించడం, మురుగునీటి పారుదల వ్యవస్థలు అభివృద్ధి చెందకపోవడం వంటి కారణాలతో నగరం ఉత్పత్తి చేసిన మురుగునీరు క్రమంగా మూసీలోకే చేరడం ప్రారంభమైంది.

దీనికి పారిశ్రామిక వ్యర్థాలు తోడవడంతో ఒకప్పుడు జీవజలంగా ప్రవహించిన నది, గత ఐదు దశాబ్దాల్లో క్రమంగా మురుగునీటి కాలువగా మారిపోయింది. మూసీ నది నేడు దుర్వాసన వెదజల్లే కాలుష్య ప్రవాహంగా మారడం మానవ నిర్లక్ష్యానికి నిదర్శనం.

అనేక రెట్లు పెరిగిన హైదరాబాద్ నగర విస్తీర్ణం

1908 మూసీ వరదలు హైదరాబాద్ నగర ప్రణాళికలో నిర్ణయాత్మకమైన పరిణామానికి దారి తీశాయి. నగరం అతలాకుతలం అవడం, వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం, నగర జీవనం పూర్తిగా స్తంభించిపోవడం పాలకులను తీవ్రంగా ఆలోచింపజేసింది. పర్యవసానంగా, నగరాన్ని భవిష్యత్ వరదల నుంచి రక్షించేందుకు నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు దాదాపు శతాబ్దకాలం పాటు హైదరాబాద్‌కు తాగునీటి భద్రతకు వెన్నెముకగా నిలిచాయి.

మూసీ సమస్య కేవలం కాలుష్యం మాత్రమే కాదు

నేడు మూసీ సమస్య కేవలం కాలుష్య సమస్య మాత్రమే కాదు. అది నగర భద్రత, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక, పర్యావరణ పరిరక్షణలకు సంబంధించిన బహుముఖ సవాలుగా మారింది. ఈ సవాళ్లన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం మూసీ పునరుజ్జీవనాన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమంగా చేపట్టింది. దశలవారీగా అమలుచేస్తున్న ఈ ప్రాజెక్టు మొదటి విడతకు సుమారు రూ.7,000 కోట్లు కేటాయించారు.

ఈ ప్రాజెక్టు అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మూసీ పునరుజ్జీవనం అంటే నది ఒడ్డున అందమైన ఉద్యానవనాలు, నడక మార్గాలు, వినోద కేంద్రాలు నిర్మించడం ద్వారా నగర జీవితాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చడమే అనే భావన ప్రజల్లో బలపడిపోయింది.

కానీ కాలుష్యాన్ని నివారించడం, మురుగునీరు నదిలోకి చేరకుండా అడ్డుకోవడం, ఆక్రమణలను
తొలగించడం, వరదనీరు సాఫీగా ప్రవహించేలా నది ప్రవాహ మార్గాన్ని పునరుద్ధరించడం, నదీతీరాలను పర్యావరణహితంగా అభివృద్ధి చేయడం, వారసత్వ కట్టడాలను పరిరక్షించడం, జలవిహారం, పర్యాటక కార్యకలాపాలకు అవకాశాలను కల్పించడం వంటి అనేక లక్ష్యాలు కూడా ఈ ప్రణాళికలో అంతర్భాగాలుగా ఉన్నాయి.

జీవనాడిగా మూసీకి పూర్వవైభవమే లక్ష్యం

ఒకవైపు నగర పర్యావరణాన్ని మెరుగుపరుస్తూనే అదే సమయంలో ప్రజల్లో ఫుల్​ ట్యాంక్ లెవెల్ (ఎఫ్​టీఎల్), బఫర్ జోన్ వంటి భావనలపై సమగ్ర అవగాహన పెంపొందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇంతటి భారీ ప్రాజెక్టు వివాదాలకు అతీతంగా ఉండడం సాధ్యం కాదు.

నదీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది కుటుంబాల పునరావాసం, వారి జీవనోపాధిపై ప్రభావం, ప్రాజెక్టు వ్యయం, పర్యావరణ సమతుల్యత, పారదర్శకత, అమలు విధానం, మతపరమైన కట్టడాల పరిరక్షణ వంటి అంశాలపై పలు వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఇలాంటి భారీ ప్రజా ప్రాజెక్టుల్లో రాజకీయపరంగా భిన్నాభిప్రాయాలు కూడా సహజంగానే వ్యక్తమవుతుంటాయి. అయితే, వాటికి అతీతంగా నదిని పరిరక్షించాల్సిన అవసరాన్ని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. ఆ లక్ష్యాన్ని సాధించే ప్రక్రియ మాత్రం మానవీయకోణంలో, పారదర్శకంగా, పర్యావరణానికి అనుకూలంగా ఉండాలనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు ఆశించిన లక్ష్యాలను సాధించి, మూసీ మళ్లీ హైదరాబాద్ జీవనాడిగా తన పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని ఆశిద్దాం.

- కృష్ణ బాలాజీ పల్లపోతు, డిప్యూటీ జనరల్​ మేనేజర్ (రిటైర్డ్), ఎస్‌బీఐ

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు 'వెలుగు' కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News