Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ మెట్రో రికార్డు: 25 నిమిషాల్లోనే  గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు.. గుండె, ఊపిరితిత్తుల తరలింపు

హైదరాబాద్ మెట్రో రికార్డు: 25 నిమిషాల్లోనే గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు.. గుండె, ఊపిరితిత్తుల తరలింపు

V6 Velugu 1 week ago

ప్రాణాలను కాపాడే అత్యవసర వైద్య సేవల్లో హైదరాబాద్ మెట్రో మరోసారి తన గొప్పతనాన్ని చాటుకుంది. గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్స్ నుంచి సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని కిమ్స్ ఆసుపత్రికి దాత నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తులను అత్యంత వేగంగా తరలించేందుకు మెట్రో అధికారులు ప్రయారిటీ మెడికల్ ట్రాన్సిట్ ను విజయవంతంగా నిర్వహించారు.

గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి నుంచి సేకరించిన ఈ కీలక అవయవాలను.. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి రసూల్‌పురా మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలు ద్వారా రవాణా చేశారు. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే (ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:05 గంటల మధ్య) దాదాపు 14 కిలోమీటర్ల దూరాన్ని, 13 స్టేషన్లను దాటుకుంటూ విజయవంతంగా పూర్తి చేశారు.

హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు, వైద్య నిపుణులు, ఆసుపత్రి యాజమాన్యాల మధ్య అద్భుతమైన సమన్వయం వల్ల ఈ క్లిష్టమైన అవయవ మార్పిడి ప్రక్రియ సజావుగా సాగింది. నగరంలో రద్దీ సమయంలోనూ సమయానికి అవయవాలను చేరవేయడంలో మెట్రో ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

కేవలం రవాణా రంగానికే పరిమితం కాకుండా, అత్యవసర వైద్య సేవలను అందించడంలోనూ తమ నిబద్ధత ఎప్పటికీ ఉంటుందని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (L&TMRHL) స్పష్టం చేసింది. ప్రాణాలను నిలిపే ఈ గొప్ప కార్యక్రమానికి సహకరించిన మెట్రో సిబ్బందిని అందరూ అభినందిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News