IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగనున్న కీలక పోరుకు ముందు వాంఖడే స్టేడియంలో భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి సందడి చేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫుట్‌బాల్ మైదానంలో గోల్స్ కొట్టడమే కాదు, క్రికెట్ మైదానంలో క్యాచ్‌లు పట్టడంలోనూ తనకు తిరుగులేదని అతడు నిరూపించారు. ఈ సరదా సన్నివేశం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
సునీల్ ఛెత్రి సూపర్బ్ క్యాచ్: నెట్స్ ప్రాక్టీస్ సమయంలో బంతి తన వైపుకు రాగానే, ఏమాత్రం తడబడకుండా ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌లా భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి ఆ క్యాచ్‌ను అందుకోవడం అక్కడున్న వారందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక అగ్రశ్రేణి అథ్లెట్‌కు ఉండాల్సిన రిఫ్లెక్సెస్ (Reflexes) అతడిలో ఏమాత్రం తగ్గలేదని ఈ క్యాచ్ పట్టడం ద్వారా నిరూపితమైంది.
12వ ఆటగాడిగా సునీల్: క్యాచ్ పట్టిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు హెడ్ కోచ్ మహేల జయవర్ధనేతో మాట్లాడుతూ.. చిరునవ్వుతో 'One day, 12th man' (ఏదో ఒక రోజు, 12వ ఆటగాడిగా వస్తాను) అని అనడం ఆయనలోని హాస్యచతురతను, వినయాన్ని చాటిచెప్పింది. కాగా ఫుట్‌బాల్ మైదానంలో గోల్స్ వర్షం కురిపించే ఛెత్రి, క్రికెట్ పిచ్‌పై కూడా అంత చురుగ్గా కనిపించడం క్రీడాభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

