Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జమ్మికుంట బల్దియాలో  డీజిల్ స్కామ్‌..రూ.32.31 లక్షలు దుర్వినియోగమైనట్లు గుర్తింపు

జమ్మికుంట బల్దియాలో డీజిల్ స్కామ్‌..రూ.32.31 లక్షలు దుర్వినియోగమైనట్లు గుర్తింపు

V6 Velugu 2 weeks ago
  • వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులు మళ్లింపు
  • నలుగురి నుంచి నిధుల రికవరీకి నోటీసులు
  • ఒకరిపై వేటు, పలువురిపై క్రిమినల్ కేసులకు సిఫార్సు
  • మున్సిపల్ కమిషనర్‌కు సీడీఎంఏ అధికారుల ఉత్తర్వులు

కరీంనగర్/జమ్మికుంట, వెలుగు: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో భారీ అవినీతి వ్యవహారం వెలుగు చూసింది. రూ.32.31 లక్షల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు ఇటీవల చేపట్టిన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్ల విచారణలో వెల్లడైంది. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్‌ని ఉద్యోగంలోంచి తొలగించడంతోపాటు నలుగురు ఉద్యోగుల నుంచి నిధుల రికవరీకి నోటీసులు ఇవ్వడం, మరో ముగ్గురిపై చర్యలకు ఆదేశించడం కలకలం రేపింది.

గత పాలకవర్గం హయాంలో..

గత మున్సిపల్ పాలకవర్గం హయాంలో ప్రభుత్వ నిధులను కొందరు అధికారులు, సిబ్బంది వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించి సొంత అవసరాలకు వినియోగించుకున్నారంటూ జమ్మికుంటకు చెందిన మాజీ కౌన్సిలర్‌, మాజీ సర్పంచ్‌ పొనగంటి మల్లయ్య విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏసీబీ, విజిలెన్స్ అధికారులు మున్సిపల్‌ కార్యాలయంలో రికార్డులు, ఖర్చుల వివరాలు, లాగ్‌బుక్కులు, శానిటేషన్​విభాగానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. విచారణ సందర్భంగా శానిటేషన్​విభాగానికి సంబంధించిన డీజిల్ ఖర్చులు, వాహనాల లాగ్‌బుక్‌ నమోదులు, ఖర్చుల వివరాలు, ఉద్యోగుల ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో అక్రమాలను గుర్తించారు. డీజిల్, పెట్రోల్ పేరిట భారీగా నిధులు కాజేసినట్లు, కొన్నిచోట్ల లాగ్‌బుక్‌లో తప్పుడు నమోదులు ఉన్నట్లు, నిధుల వినియోగంలో నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా మున్సిపల్‌ నిధులు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించారన్న అంశం విచారణలో కీలకంగా మారింది. ఈ వ్యవహారంలో మొత్తం 8 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

రూ.32.31 లక్షలు.. వారంలో రికవరీ!

ఈ వ్యవహారంలో మొత్తం 11 మంది అధికారులను బాధ్యులుగా గుర్తించినప్పటికీ.. తొలుత 8 మందిపై చర్యలకు ఆదేశించారు. నలుగురు ఉద్యోగుల నుంచి రూ.32,31,685 వారం రోజుల్లో రికవరీ చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో బోళ్ల సదానందం అనే శానిటరీ ఇన్ స్పెక్టర్‌ను సర్వీస్ నుంచి తొలగించాలని, నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు క్రిమినల్ కేసు నమోదు చేయడంతోపాటు అతడి నుంచి రూ.10.75 లక్షలు రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అలాగే జమ్మికుంట మున్సిపాలిటీ సీనియర్ అసిస్టెంట్ ఎ.భాస్కర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని, అతడి నుంచి రూ.8.14 లక్షలు రికవరీ చేయాలని ఆదేశించారు. పబ్లిక్ హెల్త్ వర్కర్ దొడ్డె సంపత్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు అతడి నుంచి రూ.7.64 లక్షలు రివకరీ చేయాలని, మరో పబ్లిక్ హెల్త్ వర్కర్ మాతంగి నరేషన్ నుంచి రూ.5.76 లక్షలు రికవరీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పర్రా మహేశ్‌ను హెచ్చరించాలని, మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్​జి.మహేశ్వర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ గుట్టాల మల్లికార్జునస్వామి మంగళవారం సాయంత్రం సదరు ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. సంబంధిత ఉద్యోగులు తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సి ఉంది. అదే సమయంలో రికవరీ చేయాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News