Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జంక్షన్లు జామైపోతాయ్!..వరంగల్ నగరంలో కొద్దిపాటి వానకే చెరువులా మారుతున్న కూడళ్లు

జంక్షన్లు జామైపోతాయ్!..వరంగల్ నగరంలో కొద్దిపాటి వానకే చెరువులా మారుతున్న కూడళ్లు

V6 Velugu 2 weeks ago
  • రోడ్లపై నీళ్లు నిలిచి వాహనాలు, జనాల రాకపోకలకు అడ్డంకులు
  • డ్రైన్లు, నాలాలపై స్లాబులు, ప్లాస్టిక్ వ్యర్థాలతోనూ సమస్యలు
  • జంక్షన్లపై ఫోకస్ పెట్టాలంటున్న జనాలు

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నగరంలో కొద్దిపాటి వాన పడినా జంక్షన్లు జామ్ అవుతున్నాయి. ఓ వైపు ఇరుకు డ్రైన్లు, మరోవైపు నాలాలపై స్లాబుల కారణంగా వరద రోడ్లను ముంచెత్తుతుండగా, జంక్షన్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి జంక్షన్లు దాటేందుకు జనాలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతుండగా, చర్యలు చేపట్టాల్సిన ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చినుకు పడితే అంతే...

వరంగల్ ట్రై సిటీలో 50కిపైగా ప్రధాన జంక్షన్లు ఉండగా, నగర రోడ్లపై నిత్యం రెండు లక్షలకు పైగా వెహికల్స్ రాకపోకలు సాగిస్తుంటాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ ఆఫీసులు, హాస్పిటల్స్, వివిధ విద్యాసంస్థలు, హోటల్స్, షాపింగ్ మాల్స్ తదితర అవసరాల కోసం వచ్చే వాహనాలతో సిటీ రోడ్లు ఫుల్ రష్ గా కనిపిస్తుంటాయి. కాగా, వర్షాకాలం వచ్చిందంటే నగరంలోని జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామ్ కామనైపోతోంది.

వరంగల్ ట్రై సిటీలోని చాలా జంక్షన్ల వద్ద వరద నాలాల్లోకి ప్రవహించేలా ఏర్పాట్లు లేవు. కాజీపేట సిగ్నల్ పాయింట్ నుంచి వరంగల్ వెంకట్రామ జంక్షన్ వరకూ చాలాచోట్లా ఇదే పరిస్థితి. ఫాతిమా జంక్షన్, వరంగల్ నిట్, భవానీనగర్, వికాస్ నగర్, హనుమకొండ బస్టాండ్, జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం, హనుమకొండ చౌరస్తా, అమృత థియేటర్ జంక్షన్, అలంకార్ జంక్షన్, ములుగు రోడ్డు, ఎంజీఎం, హంటర్ రోడ్డు, భద్రకాళి బండ్ రోడ్డు, అండర్ రైల్వే బ్రిడ్జి ఇలా ట్రై సిటీలోని చాలా జంక్షన్లు కొద్దిపాటి వర్షం పడినా చెరువులు తలపిస్తున్నాయి. ఫలితంగా వాహనాల రాకపోకలు ఇబ్బందులు ఏర్పడి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.

ఆఫీసర్లు దృష్టి పెడితేనే మేలు..

గతంలో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు జంక్షన్లు జలమయమై సమస్యలు ఏర్పడగా, జీడబ్ల్యూఎంసీ అధికారులు జంక్షన్లను క్లియర్ చేసేందుకు ప్రత్యేకంగా అధికారులకు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. దీంతో అప్పటికప్పుడు జంక్షన్లలో జామ్ అయిన నీటిని తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇదిలాఉంటే ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవుతుండగా, ఒక్క గట్టి వాన పడినా జంక్షన్ల వద్ద మళ్లీ తిప్పలు పడక తప్పని పరిస్థితి. ఓవైపు వరద నీళ్లు, మరోవైపు రోడ్లపై గుంతలతో వాహనదారులు చుక్కలు చూడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జీడబ్ల్యూఎంసీ అధికారులు నాలాలపై స్లాబులు తొలగించడంతో పాటు వరద ప్రవాహానికి ఇబ్బందులు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ప్రధాన జంక్షన్లపై దృష్టి పెట్టి వరద నీరు నిల్వకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

రోడ్లను ముంచుతున్న డ్రైన్లు, స్లాబ్ లు..

హనుమకొండ, వరంగల్ చౌరస్తాలతో పాటు ప్రధాన జంక్షన్లలో చాలాచోట్లా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. డ్రైనేజీలు ఇరుకుగా మారగా, వరద ప్రవాహం సాఫీగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నాలాలు ఉన్న చోట ఆ చుట్టుపక్కల ఉన్న ఇండ్లు, షాపుల యజమానులు డ్రైనేజీలు, నాలాలపై స్లాబులు ఏర్పాటు చేశారు. దీంతో వరద నేరుగా కాల్వల్లోకి చేరలేని పరిస్థితి ఏర్పడుతోంది. నాలాలు, డ్రైనేజీల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా రోడ్ల ముంపునకు కారణమవతున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విచ్చలవిడిగా వినియోగించి, డ్రైనేజీల్లో పడేస్తుండటంతో అవికాస్త కాల్వలను బ్లాక్ చేస్తున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో సిల్ట్ పేరుకుపోయి వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో కాల్వల ద్వారా వచ్చే నీళ్లన్నీ రోడ్ల మీదుగా జంక్షన్ల వైపు పరుగులు తీస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News