Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జొకోవిచ్ ఔట్.. యూఎస్ ఓపెన్ తొలి రౌండ్లోనే నిష్క్రమణ..  ఇలా ఓడటం తొలిసారి

జొకోవిచ్ ఔట్.. యూఎస్ ఓపెన్ తొలి రౌండ్లోనే నిష్క్రమణ.. ఇలా ఓడటం తొలిసారి

V6 Velugu 6 days ago
  • రెండు దశాబ్దాల తర్వాత గ్రాండ్‌స్లామ్‌లో ఇలా ఓడటం తొలిసారి
  • మారియానో నవోన్ సంచలన విజయం


న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తొలి రోజే పెను సంచలనం నమోదైంది.

కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌ వేటలో ఉన్న సెర్బియా సూపర్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లో నాలుగోసీడ్‌ జొకోవిచ్‌ 6-7 (5/7), 5-7, 4-6, 6-2, 6-1తో అన్‌సీడెడ్‌ మారియానో నవోన్‌ (అర్జెంటీనా) చేతిలో కంగుతిన్నాడు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో తొలి రౌండ్‌లోనే జొకో వెనుదిరగడం రెండు దశబ్దాలలో ఇదే ప్రథమం.

2006 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత తొలిసారి ఇలాంటి పరాజయాన్ని చవిచూశాడు. యూఎస్‌ ఓపెన్‌లో జొకో ఎప్పుడూ తొలి రౌండ్‌లో ఓడలేదు. కానీ 4 గంటలా 36 నిమిషాల పాటు జరిగిన ఐదు సెట్ల మారథాన్‌ పోరులో ఒక అన్‌సీడెడ్‌ కుర్రాడు షాకివ్వడం టెన్నిస్‌ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. అలాగే జొకో కెరీర్‌లో ఒక గ్రాండ్‌స్లామ్‌లో అత్యంత సుదీర్ఘమైన ప్రారంభ మ్యాచ్‌గా కూడా ఇది రికార్డులకెక్కింది.

శారీరక ఇబ్బందుల వల్లే..

శారీరక, అంతర్గత అనారోగ్యాలతో బాధపడిన జొకోవిచ్‌ మ్యాచ్‌లో ఒకదాని తర్వాత ఒకటి తప్పులు చేస్తూ ఓ అన్‌సీడెడ్‌ ప్లేయర్‌ ముందు తలవంచాడు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఏమాత్రం భయపడకుండా దూకుడుగా ఆడిన నవోన్‌ కొట్టిన షాట్లకు ఓ దశలో సెర్బియన్‌ జవాబు చెప్పలేకపోయాడు. దాంతో మ్యాచ్‌ మొత్తంలో 70 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. 10 ఏస్‌లు, 10 విన్నర్లు కొట్టిన జొకో 10 డబుల్‌ ఫాల్ట్స్‌ చేశాడు. 12 బ్రేక్‌ పాయింట్లలో నాలుగింటిని కాచుకున్నాడు.

తన సర్వ్‌లో 59 శాతం పాయింట్లు రాబట్టినా.. ప్రత్యర్థి సర్వ్‌లో 35 శాతానికే పరిమితమయ్యాడు. 9 ఏస్‌లు 36 విన్నర్లు కొట్టిన నవోన్‌ 8 డబుల్‌ ఫాల్ట్స్‌ చేశాడు. 34 అన్‌ఫోర్స్‌డ్‌ ఎర్రర్స్‌ మాత్రమే చేశాడు. తన సర్వీస్‌లో 98 శాతం పాయింట్లు గెలిచి పైచేయి సాధించాడు. 17 బ్రేక్‌ పాయింట్లలో ఆరింటిని కాచుకున్నాడు. మ్యాచ్‌ మధ్యలో ఒకసారి వాంతికి చేసుకున్న జొకో.. తర్వాత ఎడమ కాలి కండరాల నొప్పితో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. దాంతో నాలుగు, ఐదో సెట్‌ మధ్య మెడికల్‌ బ్రేక్‌లో డాక్టర్‌ను సంప్రదించి మాత్రలు మింగాడు.

తన నడుముకు మసాజ్‌ చేయించుకున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. కొన్ని షాట్స్‌ తర్వాత నొప్పి భరించలేక బాధతో ముఖం చిట్లించాడు. ఓవరాల్‌గా 21 ఏళ్ల కిందట యూఎస్‌ ఓపెన్‌లో అరంగేట్రం చేసిన చోటే ఇప్పుడు పరాజయం ఎదురుకావడంతో జొకో భవిష్యత్‌పై సందిగ్ధత మొదలైంది. ఇదే చివరి టోర్నీయా లేక మరో గ్రాండ్‌స్లామ్‌లో బరిలోకి దిగుతాడా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కోర్టులో నేను భయంకరమైన అనుభూతిని ఎదుర్కొన్నా. అందుకే ఈ మ్యాచ్‌ను నేను ఆనందించలేదు. వాంతులు చేసుకోవడం తీవ్ర సమస్యగా మారింది. దురదృష్టవశాత్తు ఈ ఏడాది ప్రతి మ్యాచ్‌లోనూ నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నా. ఆ టైమ్‌లో నా శరీరం మొత్తం కుప్పకూలిపోతుంది. ప్రాథమికంగా కండరాలు పట్టేసి నొప్పి వచ్చింది. చివరకు నడుం, భుజం సహకరించలేదు. ఈ ఓటమి తర్వాత ఏం జరుగుతుందనే దానిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తా. ఈ పద్ధతిలో ఎంత దూరం వెళ్లగలను అనే విషయాలను ఆలోచించాలి. మ్యాచ్‌లో నాలుగో గేమ్‌ నుంచి చాలా ఇబ్బందిపడ్డా. నా శరీరం, నా ఆట తీరు గురించి కలిగిన అనుభూతి అసలు బాగాలేదు. కోర్టులో గడిపిన ప్రతిక్షణం నాకు చాలా అసహ్యంగా అనిపించింది.-

- జొకోవిచ్‌

మెద్వెదెవ్‌ ముందుకు.. వీనస్‌ వెనక్కి..

ఇతర మెన్స్‌ సింగిల్స్‌ తొలి రౌండ్‌లో డానియెల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 6-4, 6-2, 6-4తో హుగో గాస్టన్‌ (ఫ్రాన్స్‌)పై, అలెగ్జాండర్‌ బుబ్లిక్‌ (కజకిస్తాన్‌) 6-4, 6-2, 3-6, 6-1తో జేజే వుల్ఫ్‌ (అమెరికా)పై, టొమ్మి పాల్‌ (అమెరికా) 6-7 (3/7), 6-1, 6-3, 6-3తో వాంగ్‌ (చైనా)పై, లెహెకా (చెక్‌) 6-1, 7-6 (7/5), 4-6, 6-2తో కారెనో బుస్టా (స్పెయిన్‌)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. విమెన్స్‌ సింగిల్స్‌లో వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) 2-6, 6-7 (6/8)తో కెనిన్‌ (అ మెరికా) చేతిలో ఓడగా, స్వితోలినా (ఉక్రెయిన్‌) 6-1, 6-2తో సియారా (అర్జెంటీనా)పై, కోస్టుక్‌ (ఉక్రెయిన్‌) 6-4, 6-1తో హుంటర్‌ (ఆస్ట్రేలియా)పై, ఫెర్నాండేజ్‌ (కెనడా) 6-3, 6-2తో జాంగ్‌ (చైనా)పై, జాస్మిన్‌ పౌలిని (ఇటలీ) 6-3, 3-6, 6-4తో ఎరోనికా ఎర్వెక్‌ (స్లొవేనియా)పై నెగ్గి ముందంజ వేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News