Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'కల్యాణలక్ష్మి'పై నేడు విచారణ..రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు

'కల్యాణలక్ష్మి'పై నేడు విచారణ..రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు

V6 Velugu 3 weeks ago

హైదరాబాద్‌, వెలుగు: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.

అప్పీలుపై రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను చీఫ్ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్​సోమవారం తోసిపుచ్చింది. అప్పీలుకు నంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కోసం ప్రభుత్వం 2014 నుంచి జారీ చేసిన 8 జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్‌ గోపాల్‌ వ్యక్తిగత హోదాలో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని సవాల్​ చేస్తూ ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. పిటిషనర్‌కు ఈ పథకాలతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని, ఆయన హక్కులకు ఎలాంటి భంగం కలగలేదని తెలిపారు. షాదీముబారక్‌ వంటి పథకాలను సుప్రీంకోర్టు అనుమతించిందని, ఆడపిల్లల విద్య కోసం పలు రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.

మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. రాజ్యాంగంలోని అధికరణ 162 కింద ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చని, అధికరణ 15(3) కింద మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అధికరణల కింద ప్రభుత్వానికి ఉన్న అధికారాల పరిధిని పరిశీలించాల్సి ఉందని తెలిపింది. దీనిపై మంగళవారం సమగ్రంగా విచారణ చేపడతామని పేర్కొంటూ కేసును వాయిదా వేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News