Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కెనడాలో రూ.83 లక్షల ప్యాకేజ్.. ఫ్యామిలీ కోసం ఇండియా రావటంపై టెక్కీ డైలమా!

కెనడాలో రూ.83 లక్షల ప్యాకేజ్.. ఫ్యామిలీ కోసం ఇండియా రావటంపై టెక్కీ డైలమా!

V6 Velugu 1 week ago

విదేశాల్లో స్థిరపడాలనే కల ఒకవైపు.. స్వదేశానికి తిరిగి వెళ్లాలనే తపన మరోవైపు. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న ఓ యువ టెక్కీ డైలమా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కెనడాలో ప్రభుత్వ రంగ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల కుర్రోడు ప్రస్తుతం తీవ్రమైన సందిగ్ధతను ఎదుర్కొంటున్నాడు. కెనడాలోనే జీవితాన్ని కొనసాగించాలా? లేక ఫ్యామిలీకి దగ్గరగా ఉండేందుకు భారత్‌కు వచ్చేయాలా? అని రెడిట్ వేదికగా సలహాలు కోరాడు.

కెనడాలో సంపాదన మన కరెన్సీలో లెక్కిస్తే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఏడాదికి రూ.83 లక్షలు సంపాదిస్తున్నాడు. ట్యాక్సులు, పెన్షన్ పేమెంట్స్ పోను ప్రతి నెలా సుమారు రూ.4 లక్షల 50వేలు టేక్-హోమ్ శాలరీగా అందుకుంటున్నాడు. కెనడా ప్రభుత్వ ఉద్యోగం కావడంతో కెరీర్ పరంగా మంచి స్థిరత్వం ఉంది. అంతేకాకుండా ఇప్పటివరకు రూ.43 లక్షలు ఆదా చేయడంతో పాటు, భారతదేశంలో రియల్ ఎస్టేట్ లోనూ పెట్టుబడులు పెట్టాడు. దీంతో స్వదేశానికి తిరిగి వస్తే తాను పూర్తిగా జీరో నుంచి మొదలుపెట్టాల్సిన అవసరం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

అయినప్పటికీ ఆయనను ఒక బలమైన ఆలోచన కుదిపేస్తోంది. కెనడాలోనే ఉంటే పెళ్లి చేసుకుని, పిల్లలతో ప్రశాంతమైన ప్రభుత్వ ఉద్యోగ జీవితాన్ని గడపవచ్చని భావిస్తున్నాడు. కానీ పూణే, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లోని సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ కంపెనీలు, GCC కొలువుల వైపు ఆకర్షితుడవుతున్నాడు. కుటుంబానికి దగ్గరగా ఉండాలనే కోరిక ఒకవైపు ఉంటే.. భారతీయ ఐటీ రంగంలో ఉండే తీవ్రమైన ఒత్తిడి, లేఆఫ్స్ భయం, ఉద్యోగ అనిశ్చితి తనను వెనక్కిలాగుతున్నాయని వాపోతున్నాడు. ముఖ్యంగా 30లు, 40వ దశకంలోనూ డెవలపర్లకు ఇక్కడ ఎలాంటి అవకాశాలు ఉంటాయనే దానిపై అనుభవజ్ఞులైన నిపుణుల సలహా కోరాడు.

ఈ పోస్ట్‌పై రెడిట్ యూజర్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ సరిపడా ఆర్థిక భద్రత లేనందున.. కెనడాలోని స్థిరమైన ప్రభుత్ ఉద్యోగాన్ని వదులుకోవడం పెద్ద తప్పిదమని కొందరు హెచ్చరిస్తున్నారు. భారీగా పొదుపు చేసుకుని, రిటైర్మెంట్ కార్పస్ సమకూర్చుకున్నాకే భారత్‌కు రావడం మంచిదని సలహా ఇస్తున్నారు. మరోవైపు డబ్బు కంటే కుటుంబంతో గడిపే క్షణాలు, ఆప్యాయతలే ముఖ్యమని భావించేవారు వెంటనే స్వదేశానికి వచ్చేయమని ధైర్యం చెబుతున్నారు.

ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్నప్పటికీ.. మనశ్శాంతి, ఫ్యామిలీ టైమ్, వృత్తిపరమైన అనిశ్చితి మధ్య నలిగిపోతున్న ఈ టెక్కీ డైలమా.. విదేశాల్లో బతుకులాట వెనుక ఉండే అసలు సిసలు వాస్తవాలను కళ్లకు కడుతోంది. కెనడా సుఖవంతమైన భవిష్యత్తును ఇస్తుందా? లేక స్వదేశం ఇచ్చే మానసిక సంతృప్తి ముందు అవేవీ లెక్కలేదా? అనే ప్రశ్నతో ఈ టెక్కీ ప్రయాణం ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News