V6 Velugu Posted on Jun 16, 2021
మైసూర్: తీవ్రంగా గాయపడిన రెండేళ్ల కొడుకును ఆస్పత్రిలో చేర్పించి.. అతడి బాధ్యతను డాక్టర్లు, సిబ్బందికి అప్పజెప్పి తాను డ్యూటీకి వెళ్లిపోయిన అంబులెన్స్ డ్రైవర్ ఉదంతం ఇది. అంబులెన్స్ డ్యూటీ నిర్వహిస్తూనే మధ్య మధ్యలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కన్న కొడుకు పరిస్థితిపై డ్యూటీ డాక్టర్లకు, నర్సులతో ఆరా తీస్తూనే ఉన్నాడు. దగ్గరుండి భార్యా పిల్లలకు ధైర్యం అందించాల్సిన పరిస్థితి అయినప్పటికీ మరో వైపు అంబులెన్స్ డ్రైవర్ల కొరతతో తానే విధులు నిర్వహిస్తానని వెళ్లాడు. ఇంత చేసినా చివరకు తన కొడుకు చనిపోవడంతో అంబులెన్స్ డ్రైవర్ కన్నీరుమున్నీరవుతున్నాడు.
డ్యూటీలో భాగంగా మైసూరు నుంచి చామరాజనగర్ తదితర ప్రాంతాలకు పేషెంట్లను తరలిస్తూ.. అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో నిన్న మంగళవారం డ్యూటీకి వెళుతుండగా కొడుకు మరణవార్త విని కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలోని సాటి రోగులు, సిబ్బంది అంబులెన్స్ డ్రైవర్ గొప్ప మనసుతో చేసిన సేవలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో మైసూరు బీజేపీ అధ్యక్షుడు శ్రీవత్స తదితరులు స్పందించారు. సొంత కొడుకు ఆస్పత్రిలో ఉన్నా.. ఇతరుల కోసం విధులు నిర్వహించడం గొప్ప విషయమని, అతని సేవలను ఎవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరని ప్రశంసించారు. బీజేపీ నేత శ్రీవత్స తదితరులు సయ్యద్ ముబారక్ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.

