Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోల్బెల్ట్: యూజీ మైన్ల ప్రైవేటీకరణ అబద్ధం..సింగరేణి యాజమాన్యం స్పష్టీకరణ

కోల్బెల్ట్: యూజీ మైన్ల ప్రైవేటీకరణ అబద్ధం..సింగరేణి యాజమాన్యం స్పష్టీకరణ

V6 Velugu 2 weeks ago

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి అండర్​ గ్రౌండ్​ బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని సింగరేణి యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

సింగరేణిలోని భూగర్భగనులు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పటికీ, తెలంగాణలో ఉపాధి కల్పన, ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకొని నష్టాలను సాధ్యమైనంత మేర తగ్గిస్తూ వాటిని కొనసాగిస్తున్నామని పేర్కొంది.

బాధ్యతాయుతమైన ప్రభుత్వరంగ సంస్థగా, మైనింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన సింగరేణి ప్రస్తుతం 21 భూగర్భ గనులు, 17 ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తోందని తెలిపింది. తెలంగాణతో పాటు తమిళనాడు, ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు బొగ్గును సప్లై చేస్తూ దేశ ఇంధన భద్రతకు, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతున్నట్లు తెలిపింది. భూగర్భ గనులను మరింత సమర్థ వంతంగా నిర్వహించడం, నష్టాలను తగ్గించడం, సాధ్యమైనన్ని గనులను లాభదాయకంగా మార్చడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పరిరక్షించడంతో పాటు మరింత ఉపాధి కల్పించడమే సింగరేణి యాజమాన్యం ప్రధాన లక్ష్యమని పేర్కొంది.

శాంతిఖని గనిని ప్రైవేటీకరించే ప్రతిపాదన లేదు

మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా బెల్లంపల్లిలోని శాంతిఖని అండర్ గ్రౌండ్​ మైన్​ను ప్రైవేటీకరిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని, దాన్ని ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏదీ లేదని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. భారీ నష్టాల్లో కొనసాగుతున్న శాంతిఖని గనిలో ఉత్పత్తి కార్యకలాపాలను ఎండీవో(మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్) విధానంలో నిర్వహించడం ద్వారా ఉత్పత్తి వ్యయాలను తగ్గించగలమా? నష్టాలను నివారించగలమా? అనే అంశాన్ని అధ్యయనం చేసేందుకు మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా ఒక ప్రతిపాదన రూపొందించినట్లు పేర్కొంది.

శాంతిఖని గనికి జారీ చేసిన ఈవోఐని ఆధారం చేసుకొని సింగరేణి భూగర్భ గనులను ప్రైవేటుపరం చేస్తోందనే ప్రచారం చేయడం సరికాదని, ఇలాంటి తప్పుడు ప్రచారంతో సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబాలు, ప్రజలు ఆందోళనలో పడే ప్రమాదం ఉందని పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News