Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొంప ముంచిన పాక్ బ్యూటీ క్రీమ్.. అందం కోసం వాడిన 18 మందికి కిడ్నీ సమస్యలు

కొంప ముంచిన పాక్ బ్యూటీ క్రీమ్.. అందం కోసం వాడిన 18 మందికి కిడ్నీ సమస్యలు

V6 Velugu 1 week ago

అందంగా, తెల్లగా కనిపించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని మార్కెట్‌లో "ఇన్‌స్టంట్ ఫెయిర్‌నెస్" పేరుతో అమ్ముతున్న కొన్ని బ్యూటీ క్రీమ్‌లు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 18 మంది మహిళలకు కిడ్నీ సమస్యలు రావడానికి ఒక స్కిన్ వైటనింగ్ క్రీమ్ కారణమైందని వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అందం కోసం వాడిన క్రీమ్ చివరికి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందనే విషయం అందరినీ షాక్‌కు గురిచేసింది.

ల్యాబ్ పరీక్షల్లో బయటపడ్డ నిజాలు..
మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నిర్వహించిన ప్రయోగశాల పరీక్షల్లో గోరీ బ్యూటీ క్రీమ్ (Goree Beauty Cream)తో పాటు ఫేస్ ఫ్రెష్ గోల్డ్ బ్యూటీ క్రీమ్ & సీరమ్, గోల్డెన్ స్టార్ బ్యూటీ క్రీమ్ల్లో అనుమతించిన పరిమితి కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మెర్క్యురీ(పాదరసం), లెడ్ (సీసం) ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ ఉత్పత్తుల అమ్మకాలతో పాటు వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.

కిడ్నీలపై ఎలా ప్రభావం చూపుతుంది?
మెర్క్యురీ చర్మాన్ని తెల్లగా కనిపించేలా చేయడానికి వీలుగా మెలానిన్ ఉత్పత్తిని అణచివేస్తుంది. అయితే ఈ రసాయనం చర్మం ద్వారా శరీరంలోకి చేరి క్రమంగా కిడ్నీల్లో పేరుకుపోతుంది. దీని వల్ల కిడ్నీ పనితీరు దెబ్బతినడం, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నాగ్‌పూర్‌లో 2 ఏళ్లలోనే కిడ్నీ సమస్యలతో ఆస్పత్రులకు వచ్చిన 18 మంది మహిళలు ఇదే క్రీమ్‌ను వాడినట్లు వైద్యులు గుర్తించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

ఆన్‌లైన్ విక్రయాలపై ప్రశ్నలు..
వాస్తవానికి పాకిస్థాన్‌లో తయారైన ఈ బ్యూటీ క్రీమ్ సోషల్ మీడియా పేజీలు, మీషో లాంటి ఈ-కామర్స్ వెబ్ సైట్ల్ ద్వారా విక్రయించినట్లు వార్తలు రావడంతో తీవ్ర చర్చ సాగుతోంది. దాయాది పాక్ నుంచి దిగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ ఈ ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి ఎలా వచ్చాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై స్పందించిన ఈ-కామర్స్ సంస్థ మీషో.. వెంటనే ఈ బ్యూటీ క్రీమ్ ను తమ వెబ్ సైట్ నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపింది.

ఫెయిర్‌నెస్ కంటే ఆరోగ్యమే ముఖ్యం..
అద్భుత ఫలితాలు ఇస్తామని చెప్పే స్కిన్ వైటెనింగ్ ఉత్పత్తులను గుడ్డిగా నమ్మకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొనుగోలు చేసే ముందు వాటి వాడిన పదార్థాలు, తయారీ సంస్థ, అధికారిక అనుమతులు తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చర్మం వెంటనే తెల్లబడుతుందనే ప్రకటనలు చేసే ఉత్పత్తుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అందం కోసం తెలియని క్రీమ్‌లను వాడితే, అందం రావడం సంగతి పక్కన పెడితే కిడ్నీలతో పాటు మొత్తం ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. సో ఫ్రెండ్స్ అందం కోసం ఏవేవో క్రీమ్స్ వాడకండి వాటిలోని కెమికల్స్ మీ ఆరోగ్యాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News