Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుట్టుమిషన్ల టెండర్ పూర్తి చేయండి : మంత్రి పొన్నం ప్రభాకర్

కుట్టుమిషన్ల టెండర్ పూర్తి చేయండి : మంత్రి పొన్నం ప్రభాకర్

V6 Velugu 2 weeks ago
  • బీసీ చైర్మన్లకు ఆఫీసులు కేటాయించండి
  • అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ కుట్టు మిషన్ల స్కీమ్ టెండర్లను ఈ నెల 7లోగా పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులు, ప్రొక్యూర్‌మెంట్, టెండర్ ప్రక్రియను స్పీడప్​ చేయాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్ల కోసం వివిధ జిల్లాల నుంచి 1,80,170 దరఖాస్తులు అందినట్లు అధికారులు మంత్రికి వివరించారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 15 వరకు గడువు ఉందని తెలిపారు. వెయ్యి కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

కార్పొరేషన్లకు ఆఫీసులు.. గురుకుల భవనాలపై నివేదిక

బీసీ కుల సంఘాల కార్పొరేషన్ల చైర్మన్లకు కార్యాలయాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే ప్రక్రియను స్పీడప్ చేయాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాల మాయదేవిని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 327 గురుకుల స్కూళ్లలో కేవలం 22 స్కూళ్లకు మాత్రమే సొంత భవనాలు ఉన్న నేపథ్యంలో.. మిగిలిన స్కూళ్లకు అవసరమైన భవనాలు, స్థలాలపై సమగ్ర నివేదికను ఈ నెల 15 లోపు అందించాలని రీజినల్ కో ఆర్డినేటర్లను మంత్రి ఆదేశించారు.

అవసరమైన చోట కలెక్టర్ల ద్వారా స్థల సేకరణ ప్రక్రియను స్పీడప్​ చేయాలన్నారు. ఇందుకోసం బీసీ సంక్షేమ శాఖకు చెందిన నలుగురు ఉన్నతాధికారులతో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్పెషల్ కేసులకు సంబంధించి గతంలో మంజూరైన స్కాలర్‌షిప్‌లు, కొత్త దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్ల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

అర్హులైన విద్యార్థుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కల్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. 2023--26 మధ్య వచ్చిన దరఖాస్తులు, క్లియర్ చేసిన చెక్కులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో సుమారు 50 వేల మంది గీత కార్మికులు ఉండగా, 40 వేల మందికి కాటమయ్య కిట్ల వినియోగంపై శిక్షణ పూర్తయిందని అధికారులు తెలిపారు. ప్రతి గ్రామంలో కనీసం 10 రక్షణ కిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. సమావేశంలో అధికారులు సైదులు, మల్లయ్య బట్టు, అలోక్ కుమార్, మామిడి హరికృష్ణ, ఉదయ్ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News