Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాపై పర్సనల్‌ అటాక్ చేస్తే..మేం కూడా చేస్తం:కేటీఆర్‌

మాపై పర్సనల్‌ అటాక్ చేస్తే..మేం కూడా చేస్తం:కేటీఆర్‌

V6 Velugu 3 weeks ago
  • సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతాం: కేటీఆర్‌
  • రేవంత్‌రెడ్డి 18 గంటలు పనిచేసి ఏం సాధించిండు?
  • మద్యం ఆదాయంలో వృద్ధి తప్ప
  • అన్ని రంగాల్లో తెలంగాణ వెనక్కి
  • జాబ్‌ క్యాలెండర్‌ కాదు.. అది జాబ్‌లెస్ క్యాలెండర్
  • నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో మాట్లాడుతానని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:వ్యక్తిగత అంశాలపై దాడి చెయ్యాలనుకుంటే తాము కూడా చెయ్యగలమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామని కాంగ్రెస్‌, సీఎం రేవంత్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ తమకు తెలుసని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ప్రెస్​మీట్​నిర్వహించారు.

అనంతరం మీడియాతో చిట్​చాట్‌ చేశారు. 18 గంటలు పని చేశానని చెబుతున్న రేవంత్ రెడ్డి సాధించింది ఏముందని ప్రశ్నించారు. సర్వే నంబర్లు చూసి.. ఇబ్బంది పెట్టడం తప్ప చేసేదేముందని అడిగారు. గాజుల రామారం చౌరస్తా లేదా ఎక్కడికి వెళ్లి అడిగినా కేసీఆర్ ప్రభుత్వం బాగుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? అనేది చెబుతారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం ఆదాయంలో వృద్ధి తప్ప అన్ని రంగాల్లో రాష్ట్రం వెనక్కి వెళ్లిందని, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి దువ్వూరి సుబ్బారావు స్పష్టంగా చెప్పారని తెలిపారు.

యువతను ఘోరంగా మోసం చేశారు

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది జాబ్‌ క్యాలెండర్ కాదని, అది పక్కా జాబ్‌లెస్ క్యాలెండర్ అని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో యువతను కాంగ్రెస్, బీజేపీ ఘోరంగా మోసం చేశాయన్నారు. అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్‌కు కూడా దిక్కులేకుండా పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర నిర్వేదంలో ఉన్నారని, డిప్యూటీ సీఎం సొంత ఇలాకాలోనే ఒక యువకుడు కాంగ్రెస్ హామీ ఏమైందంటూ లేఖ రాసి ఆత్మహత్యాయత్నం చేయడం కలచివేసిందన్నారు. ఆ పిల్లాడి సూసైడ్ నోట్.. రేవంత్ అసమర్థ పాలనకు ఒక చార్జిషీట్ అని అన్నారు.

నిరుద్యోగులు ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. రాష్ట్రంలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారని నిలదీశారు. ఇంజినీర్లు క్రిమినల్ వేస్ట్ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, విదేశాల్లో డెవలప్ అవుతున్న మన తెలంగాణ ఇంజినీర్లు క్రిమినల్ వేస్టా? అని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు కట్టింది, ఎల్లంపల్లి నుంచి నీళ్లను రివర్స్ పంపింగ్ చేస్తున్నది, నువ్వు కూర్చునే కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టింది ఇంజనీర్లేనని రేవంత్‌రెడ్డినుద్దేశించి అన్నారు.

ఇంజినీర్లకు నిర్మాణాలు చేపట్టడం తెలుసు.. మీ పార్టీకి సమాధి కట్టడం కూడా తెలుసని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి ప్రకటించిన డిక్లరేషన్లే అసలైన క్రిమినల్ వేస్ట్ అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లు చిత్తు కాగితంతో సమానమని పేర్కొన్నారు. జులైలో వందల టీఎంసీల నీళ్లను సముద్రంలోకి వదలడం క్రిమినల్ వేస్ట్ అని అన్నారు. రేవంత్ తెచ్చే ప్రతీ స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుందని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులపాటు నడిపితే, నిరుద్యోగుల తరఫున ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనే ఎండగడతామని కేటీఆర్ అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News