Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మక్కల అమ్మకాల్లో మార్క్‌ఫెడ్ రికార్డు.. ఈ-వేలంతో ప్రభుత్వానికి భారీ లాభం

మక్కల అమ్మకాల్లో మార్క్‌ఫెడ్ రికార్డు.. ఈ-వేలంతో ప్రభుత్వానికి భారీ లాభం

V6 Velugu 5 days ago
  • టన్నుకు సగటున రూ.25,370 పలికిన ధర
  • ఈ-వేలం విధానంతో రికార్డు ధరలు
  • మొదటిసారిగా మార్క్‌ఫెడ్‌కు తప్పిన నష్టం
  • ఈ యాసంగి మక్కలతో రూ.200 కోట్ల మేర లాభం..!

హైదరాబాద్, వెలుగు: యాసంగి మక్కల కొనుగోళ్లు, విక్రయాల్లో మార్క్‌ఫెడ్ రికార్డు సృష్టించింది. సంప్రదాయ ఈ--టెండర్ కు స్వస్తిపలికి.. ఈ-వేలం విధానాన్ని అమలు చేయడంతో మొక్కజొన్నకు రికార్డు స్థాయిలో ధర లభించింది. మూడు విడతల్లో నిర్వహించిన ఈ--వేలాల్లో టన్నుకు గరిష్టంగా రూ.26,500, కనిష్టంగా రూ.24,100, సగటున రూ.25,370 ధర నమోదైంది. మొక్కజొన్న విక్రయంతో టన్నుకు దాదాపు రూ.1,500 మేర అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ-వేలంతో నష్టాల నుంచి గట్టెక్కిన మార్క్‌ఫెడ్..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్క్‌ఫెడ్‌ను నష్టాల నుంచి గట్టెక్కించి లాభాల బాట పట్టించేందుకు పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ--టెండర్ ను రద్దు చేసి పోటీని పెంచే ఈ--వేలం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయంతో కొనుగోలుదారుల మధ్య పోటీ పెరిగి మార్కెట్‌కు అనుగుణంగా అత్యుత్తమ ధర లభించింది. గత యాసంగి (2025-26) సీజన్‌లో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా దాదాపు 14.60 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసింది.

ఒకే సీజన్‌లో ఇంత భారీ స్థాయిలో మొక్కజొన్న కొనుగోలు చేయడం మార్క్‌ఫెడ్ చరిత్రలో ఇదే తొలిసారి. అయితే నిల్వ సామర్థ్యం పరిమితంగా ఉండటంతో జిల్లా కలెక్టర్ల సహకారంతో ఓపెన్ షెడ్లు, కాటన్ జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లులు తదితర తాత్కాలిక గోదాముల్లో మక్కలు నిల్వ చేశారు.

వాటిలో దాదాపు 3.80 లక్షల టన్నుల మొక్కజొన్న వర్షాలకు తడిచిపోయే ప్రమాదం ఉండటంతో, 30 రోజుల్లో లిఫ్టింగ్ పూర్తి చేయాలనే షరతుతో ప్రత్యేక ఈ--వేలం నిర్వహించి టన్నుకు రూ.22 వేల చొప్పున విక్రయించారు. దీంతో వంద కోట్ల మేర నష్టం జరిగినా, వర్షాల కారణంగా సంభవించబోయే భారీ నష్టాన్ని ప్రభుత్వం నివారించింది.

గోదాముల్లోని మరో 10.98 లక్షల టన్నులకు భారీ ధరలు..

మిగిలిన మరో 10.98 లక్షల టన్నుల మొక్కజొన్నను సురక్షితంగా గోదాముల్లో నిల్వ చేసి, మార్కెట్ పరిస్థితులను విశ్లేషించిన అనంతరం టన్నుకు రూ.24 వేల బేస్ ప్రైస్ నిర్ణయించారు. జులై 31, ఆగస్టు 1, 3 తేదీల్లో మూడు విడతలుగా ఈ--వేలం నిర్వహించారు. మొదటి విడతలో 3,70,895 టన్నుల మొక్కజొన్న విక్రయించగా, కనిష్ట ధర రూ.24,900, గరిష్ట ధర రూ.25,600, సగటు ధర రూ.25,192 నమోదైంది.

రెండో విడతలో 3,68,154 టన్నులకు కనిష్టంగా రూ.24,100, గరిష్టంగా రూ.26,500, సగటున రూ.25,329 ధర లభించింది. మూడో విడతలో 3,59,339 టన్నుల విక్రయానికి కనిష్టంగా రూ.25,200, గరిష్టంగా రూ.26,000, సగటున రూ.25,594 ధర నమోదైంది.

ఈ యాసంగి మక్కలతో రూ.200 కోట్ల మేర లాభం..!

మూడు విడతల్లో మొత్తం 10,98,388 టన్నుల మక్కలను ఈ--వేలం ద్వారా విక్రయించగా, సగటున టన్నుకు రూ.25,370 ధర లభించింది. ఇంత భారీ పరిమాణంలో మొక్కజొన్నను అధిక ధరకు విక్రయించడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. ఫలితంగా మూడు వందల కోట్ల మేర టర్నోవర్ వచ్చినట్లయింది. అయితే, తాత్కాలిక నిల్వలతో వచ్చిన వంద కోట్ల నష్టం పోగా, ఈ యాసంగి మక్కలకు దాదాపు రెండు వందల కోట్ల వరకు నికర లాభం వచ్చినట్లు అంచనా వేశారు.

ప్రభుత్వం నిర్ణయాల వల్లే అదనపు ఆదాయం: మంత్రి తుమ్మల

మక్కల అమ్మకాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే అధిక ఆదాయం వచ్చింది. ఈ--వేలం విధానం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించడంతో అదనపు ఆదాయం వచ్చింది. అంతేకాకుండా ప్రజాధనాన్ని పరిరక్షించగలిగాం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News