Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మను ధర్మశాస్త్రం బీజేపీ మత గ్రంథమట ! రాజ్యాంగం వర్సెస్ మను ధర్మ శాస్త్రం

మను ధర్మశాస్త్రం బీజేపీ మత గ్రంథమట ! రాజ్యాంగం వర్సెస్ మను ధర్మ శాస్త్రం

V6 Velugu 1 week ago

రాహుల్ గాంధీ పూణేలో జరిగిన 'యువతి గర్జన' ఛాత్రోంకి గూంజ్‌లో వేలాదిమంది యువతులు పాల్గొన్నారు. ఆ సమావేశంలో రాహుల్ ఒక కొత్త ప్రయోగం చేశాడు. విద్యార్థినులైన అమ్మాయిలు ఎటువంటి పురుష దురహంకారాన్ని ఎదుర్కొంటున్నారు?

ఇంట్లో, బయట కాలేజీల్లో, యూనివర్సిటీల్లో తాము ఎదుర్కొంటున్న హింసాత్మక అణచివేత పద్ధతులేమిటి అనే అంశాలపైన వారిచేతనే మాట్లాడించాడు.

స్త్రీ-పురుష సమానత్వం కావాలి అని అమ్మాయిల నినాదాలతో మారుమోగిన ఆ భారీ సభలో ఆయన దేశంలో 70 కోట్ల మంది స్త్రీలు ఏ రంగాలలో అసమాన, అవమానకర జీవితాన్ని అనుభవిస్తున్నారో ముందుగానే తయారుచేయించిన స్లైడ్‌ ద్వారా పర్సంటేజీలతో సహా వారికి వివరించాడు. వారి జీవిత అనుభవాల నుంచే ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ స్త్రీ విముక్తికి ఏ మార్గాలు ఉన్నాయో చెప్పించాడు.

ఆ వేదిక మీద మను ధర్మశాస్త్రం బాల్యంలో స్త్రీలు తండ్రి చేతిలో, యవ్వనంలో భర్త చేతిలో, వృద్ధాప్యంలో కొడుకు చేతిలో ఎలా బందీ అయి బతకాలని మనువు రాశాడో కొటేషన్‌ స్లైడ్‌లో వేసి వారందరి ముందు చదివాడు. ఈ మను ధర్మ సిద్ధాంతం వ్యవస్థాగతమైనందువల్ల పితృస్వామ్యం గ్రిప్‌ భారతదేశంలో ఏ ఇతర దేశాల్లో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో లేనివిధంగా స్త్రీని అణచివేస్తుందని యువతులకు అర్థమయ్యే రూపంలో చెప్పాడు.

పితృస్వామ్యాన్ని బద్దలు కొట్టు
ఈ క్రమంలో ఆయన ఈ దేశంలో పితృస్వామ్య వ్యవస్థను బద్దలుకొట్టాల్సిన అవసరం ఉందని డిక్లేర్‌ చేశాడు. ఆ విద్యార్థినుల సమావేశంలో అన్ని మతాలవాళ్లు ఉన్నారు. ఒక ముస్లిం అమ్మాయిచేత ప్రత్యేకంగా కుటుంబ స్థాయిలో, సమాజంలో తాము ఎటువంటి అణచివేతను, హింసను ఎదుర్కొంటున్నారో చెప్పించాడు. ఈ దేశంలో మతంతో సంబంధం లేకుండా పితృస్వామ్య అణచివేత స్త్రీలను తీవ్రంగా వేధించి అణచివేస్తున్నది. అది ఈ దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నది.

అందువల్ల అన్ని మతాల్లో స్త్రీలు-పురుషులతో సమానత్వం సాధించకుండా ఈ దేశ కుటుంబాలు, కులాలు, మతాలు, దేశం అభివృద్దిలోకి రావు. ఈ మౌలిక సమస్యను ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు, దేశ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి పితృస్వామ్యాన్ని, మను ధర్మ శాస్త్రాన్ని, స్త్రీలు అన్నిరంగాలలో ఎదుర్కొంటున్న అణచివేతలను బద్దలుకొట్టే స్టాండ్ తీసుకున్నారు. ఇటువంటి స్త్రీ స్వేచ్చా స్టాండ్‌ ఒక్క అంబేద్కర్‌ మాత్రమే తీసుకుని చాలా రచనలు చేశాడు.

స్త్రీ-పురుష సమానత్వం
సాధించడానికి కొన్ని మార్గాలు సూచించాడు. అందులో ఆనాడు ఆయన ప్రతిపాదించిన హిందూ కోడ్ బిల్లు.. దానిని కాంగ్రెస్ నాయకులు, ఆర్ఎస్ఎస్, పురాతన విలువలను పాటించే బ్రాహ్మణ స్త్రీలు కూడా ఆయన హిందూకోడ్ బిల్లును వ్యతిరేకించారు.

అది వాళ్ల ఇండ్లలో పురుషుల చేత మెప్పు పొందడానికి చేసినపని, వారి ఒత్తిడి, భయంతో చేసినది. ఈ అంశంలో బాలగంగాధర్ తిలక్‌, సావర్కర్, హెగ్డే వార్‌, ఒక మేర మహాత్మా గాంధీ అంతా ఒకే రకమైన స్టాండ్‌నే కలిగి ఉన్నారు. నెహ్రూ సైతం అంబేద్కర్‌తో ఈ అంశంలో భుజం భుజం కలిపి నడవలేదు.

రాహుల్‌ గాంధీది చరిత్ర మార్చే స్టాండ్‌
పితృస్వామ్యం మీద, మను ధర్మశాస్త్రం మీద రాహుల్ గాంధీ తీసుకున్న స్టాండ్ చరిత్రగతిని మార్చేది. అది కేవలం స్త్రీలను మాత్రమే విముక్తి చేసేది కాదు. మొత్తం దేశ ప్రజలను ఒక కొత్త మార్గంలో పెట్టేది. అదే భవిష్యత్‌ మార్గం. ప్రమాదకర బీజేపీ రెస్పాన్స్‌.. రాహుల్ గాంధీ పూణే ఉపన్యాసానికి, స్త్రీలకు ఆయన ఇచ్చిన కొత్త భరోసాకి బీజేపీ భయపడిపోయింది.

వెంటనే మను ధర్మ హిందువుల ధర్మగ్రంథమని యోగీ ఆదిత్యనాథ్, ఇతర స్పోక్స్‌పర్సన్స్‌ మను ధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించి మత ద్రోహానికి పాటుపడొద్దని ప్రకటనలు గుప్పించారు. అలా మాట్లాడినవారంతా శూద్రయేతర అగ్ర కులాలవాళ్లే. అయితే బీజేపీలో ఉన్న శూద్రులు, ఓబీసీలు, దళితులు నోరు మెదపకుండా కూర్చున్నారు.

మను ధర్మశాస్త్రం శూద్రులందరి శత్రు గ్రంథం
మను ధర్మశాస్త్రంలో స్త్రీలకు వ్యతిరేకంగా ఎంత ఘోరమైన నిబంధనలున్నాయో శూద్రులు, దళితులందరిమీద అటువంటి ఘోరమైన నిబంధనలు ఉన్నాయి. అది ప్రాచీన బ్రాహ్మణ, క్షత్రియ రాజ్యాంగం. వైశ్యులు కూడా ఆ పుస్తకంలో బ్రాహ్మణ, క్షత్రియులతో సమానం కారు. అందుకే బీజేపీలోని వైశ్యులు కూడా రాహుల్ గాంధీ పూణే 'యువతి గర్జన'లో ఆయన మను ధర్మాన్ని దుయ్యబట్టాక మాట్లాడటం లేదు.

అయితే శూద్రులు, ఓబీసీలు, దళితులు ఏ పార్టీలో ఉండి కూడా మను ధర్మ శాస్ర్తం తమ ధర్మగ్రంథమని యోగీ తదితరులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే మౌనంగా ఉంటే... క్రమంగా మళ్లీ శూద్రులను, దళితులను పూర్తిస్థాయి బానిసలుగా మార్చేవైపు రాజ్య వ్యవస్థ కులవ్యవస్థ నడిపించబోతుంది.

ఇది చాలా ప్రమాదకరం. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌లో పనిచేసే కొద్దిమంది అతి సనాతన స్త్రీలు కూడా మను ధర్మశాస్త్రం తమ పవిత్ర గ్రంథమని సోషల్ మీడియాలో వాదిస్తున్నారు. అంటే వాళ్లు తిరిగి సతీసహగమనంలోకి పోవడానికి కూడా సిద్ధమవుతున్నట్టు కనపడుతుంది.

రాజ్యాంగం వర్సెస్ మను ధర్మ శాస్త్రం
ఒక పాపులర్ నాయకుడుగా రాహుల్ గాంధీ యువతీ, యువకుల తరఫున, బీదల తరఫున, దళిత, ఓబీసీల తరఫున నిలబడి పోరాడుతుంటే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రకుల నాయకులు సతమతం అవుతున్నారు. ఆయన కేవలం అధికారం తిరిగి కాంగ్రెస్ పార్టీ చేతిలోకి తేవడమొక్కటే లక్ష్యంగా ఈ పోరాటం చేయడం లేదు.

హిందూత్వ శక్తులు తిరిగి వ్యవస్థను కృతయుగంలోకి తీసుకుని స్త్రీలను, శూద్రులను, దళితులను బ్రాహ్మణీయ శక్తులకు కట్టు బానిసలను చేయాలని చూస్తుంటే రాహుల్ గాంధీ దేశాన్ని 21వ శతాబ్దపు ముందడుగు దశ నుంచి 22వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలి అనే పోరాటాన్ని కూడా మొదలుపెట్టాడు.

జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్ నాయకులు కొన్ని సంస్కరణలు తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ అందులోని సనాతనవాదులు ఆ సంస్కరణలను ముందుకు పోనివ్వలేదు. 2014 బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినాక ఆ సనాతన వాదాన్ని మరింత పెంచి అన్నిరకాల సమానత్వాన్ని తీసేసి సనాతన అసమానతలోకి తీసుకెళ్లాలని ఏమాత్రం ఆధునిక విద్య లేని కులతత్వవాదులను అధికారంలోకి తెచ్చారు. అందులో భాగమే మోదీ, అమిత్ షాల ద్వారా రిజర్వేషన్లు తీసేయించి మొత్తం వ్యవస్థను బ్రాహ్మణ్, బనియా, క్షత్రియ సనాతనవాదుల చేతుల్లోకి నెట్టాలని మోహన్ భగవత్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.

ఓబీసీ సమాజానికి కొత్త సవాలు
రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మ పునాదిగా ఒక కొత్త రాజ్యాంగాన్ని రాసి కుల వ్యవస్థను, స్త్రీ బానిసత్వాన్ని బలోపేతం చేయాలని తీవ్ర ప్రయత్నం జరుగుతున్నది. ఆ స్థితిలో రాహుల్ రాజ్యాంగం రక్షణ, మను ధర్మ శాస్త్రంపై దాడి మొదలుపెట్టాడు. దీన్ని పెట్టుబడిదారి టీవీలు కూడా హిందూ వ్యతిరేక ఉద్యమం అని ప్రచారం చేస్తున్నాయి.

ఇక్కడే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్న శూద్రులు సైతం వారి తిరోగమనవాదాన్ని అర్థం చేసుకోవాలి. మనుధర్మ శాస్త్రాన్ని హిందూ మత గ్రంథంగా ప్రచారం చేయడమంటే శూద్ర, దళిత.. మొత్తం సమాజాన్ని మళ్లీ కృతయుగంలోకి తీసుకెళ్లి మీకు చదువు వద్దు, మీకు ఉద్యోగాలు వద్దు. బానిసలుగా పనిచేయండి అని చెప్పడమే.

బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌లో శూద్రులు, రెడ్లు, వెలమలు, కమ్మలతో సహా వారి పిల్లలను మునుముందు బానిసలుగా మార్చడానికి ఒప్పుకోవడమే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నితీశ్ కుమార్‌ పూర్తిగా మనుధర్మానికి లొంగిపోయారు. కాక్రోచ్‌ జనతా పార్టీ ఉద్యమం తరువాత మళ్లీ ఆర్‌ఎస్‌ఎస్‌ రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమానికి తెరలేపింది. వీరి పిల్లలే ఈ ఉద్యమాన్ని మొదలెట్టారు.

ఇది తీవ్ర పరిణామాలకు దారి తీయనుంది. జనాభా లెక్కల్లో ఓబీసీ కేటగిరిని బీజేపీ గుర్తించడానికి వారి జనాభా లెక్కలు తీయడానికి నిరాకరిస్తూ ప్రశ్నావళి కూడా విడుదల చేసింది. ఇది మొత్తం ఓబీసీ సమాజానికి కొత్త సవాలు. వారి ఉనికికే ప్రమాదం.

ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్

  • ఓపెన్​పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు 'వెలుగు'కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News