Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మేం దాడులకు దిగితే రోడ్లపై తిరగలేరు :  బీజేపీ స్టేట్‌ చీఫ్‌ ఎన్.రాంచందర్ రావు

మేం దాడులకు దిగితే రోడ్లపై తిరగలేరు : బీజేపీ స్టేట్‌ చీఫ్‌ ఎన్.రాంచందర్ రావు

V6 Velugu 4 days ago
  • బీజేపీ ఆఫీసులు, నేతల ఇండ్లపై దాడులు పిరికిపంద చర్య
  • కాంగ్రెస్ నాయకులపై రాంచందర్‌ రావు ఫైర్​

హైదరాబాద్,వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, విద్యార్థుల సమస్యలపై బీజేపీ చేపట్టిన ఆందోళనలకు యువత నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ స్టేట్‌ చీఫ్‌ ఎన్.రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులు, యువత దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ అనుబంధ సంఘాలు బీజేపీ ఆఫీసులు, నేతల నివాసాలపై దాడులకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ ఇప్పటివరకు సంయమనం పాటిస్తోందని, ఒకవేళ కార్యకర్తలు తిరగబడితే కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో రోడ్ల మీద కూడా తిరగలేరని స్పష్టం చేశారు. ఇకనైనా దాడుల సంస్కృతిని మానుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

సోమవారం హైదరాబాద్ బీజేపీ సిటీ ఆఫీసులో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ ఆఫీసుపై నల్లరంగులు చల్లడం, నాయకుల ఇండ్లను ముట్టడించేందుకు కుట్ర పన్నడం ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ అవివేక చర్యలకు నిదర్శనమన్నారు. బిహార్‌లో ఎక్కడో జరిగిన ఘటనలను సాకుగా చూపుతూ, సంబంధం లేని కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు.

రాహుల్ గాంధీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, దేశ యువతను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. సెప్టెంబర్ 17 (ప్రధాని జన్మదినం) నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు రాష్ట్రంలోని ప్రతి మండల స్థాయిలో 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు రాంచందర్ రావు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News