ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు నేపాల్ లోని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. సున్ కోషి , బుధిగండకీ , మహాకాళి నదులలో నీటి మట్టం డేంజర్ లెవెల్స్ దాటాయి.
దీంతో నదీ పరివాహక, దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని నేపాల్ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా మధ్య నేపాల్, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని కోరారు.
నది పరివాహక దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని జాతీయ విపత్తు ప్రమాద నివారణ, నిర్వహణ సంస్థ (NDRRMA) సూచించింది.
ప్రస్తుతం కాట్మండుతో పాటు నేపాల్‌లోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగా ఉండటంతో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
నేపాల్ లో ప్రకృతి సృష్టించిన విధ్వసంలో మృతుల సంఖ్య 1127 కు చేరింది. విపత్తు సంభవించి వారం రోజులు గడుస్తున్నా ఇంకా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలిసిరాలేదు. గల్లంతైన 4వేల858 మంది కోసం గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 6వేల 541 మందిని భద్రతాదళాలు, రెస్క్యూ టీమ్స్ రక్షించింది.
మరోవైపు భారత్ కూడా సహాయక చర్యలలో పాల్గొంది. నేపాల్ అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోంది.ఇప్పటివరకు 163 మంది భారతీయులను రక్షించారు. 19 మంది సభ్యుల ప్రత్యేక ఫోరెన్సిక్ టీం, టన్నెల్ రెస్క్యూ టీంలు పనిచేస్తున్నాయని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

