Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెరవేరిన నారాయణపురం రైతుల కల..13వందల ఎకరాలు రైతులకు అప్పగింత

నెరవేరిన నారాయణపురం రైతుల కల..13వందల ఎకరాలు రైతులకు అప్పగింత

V6 Velugu 1 week ago
  • ధరణి కారణంగా ఫారెస్ట్ లిస్ట్ చేసిన భూములు
  • 780 మంది రైతులకు 1,337 ఎకరాలు పంపిణీ చేసిన ప్రభుత్వం
  • కాంగ్రెస్ పై అసత్య ప్రచారం మానుకోవాలి :
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతుల కల ఎట్టకేలకు నెరవేరింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా నారాయణపురం గ్రామంలోని భూములన్నింటినీ ఫారెస్ట్ జాబితాలో చేర్చారు. దీంతో గ్రామ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ సమస్యను పరిష్కరించాలని ఏండ్ల తరబడి ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల చుట్టూ తిరిగారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నారాయణపురం రైతుల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం కేసముద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఎంపీ వేం నరేందర్​రెడ్డి కలిసి రైతులకు పట్టాదార్ పాస్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ధరణి రద్దు చేసి భూభారతి ద్వారా భూసమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

గ్రామాల్లో దశలవారీగా భూ సర్వే చేపట్టి రైతులకు భూమి మ్యాప్, వివరాలు, క్యూ ఆర్​కోడ్​తో పట్టాబుక్ ను అందిస్తామనిచెప్పారు. నారాయణపురం గ్రామానికి చెందిన 780 రైతులకు 1,337 ఎకరాలకు సంబంధించిన పట్టాబుక్స్ అందిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలో 300 ఎకరాల అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాల్లో ఓట్లు అడగబోమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం మానుకోవాలని సూచించారు. అనంతరం కేసముద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూక్య మురళీ నాయక్, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణ, కలెక్టర్​స్నేహ శబరీష్, రెవెన్యూ కమిషనర్ లోకేశ్ కుమార్, ల్యాండ్​సెటిల్​మెంట్​అధికారి రాజీవ్​గాంధీ హన్మంతు, మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బానోతు సునీత పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News