Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంజాబ్ నేషనల్ బ్యాంకులో కొత్త స్కామ్.. వాల్ట్‌లో రూ.7కోట్ల 40 లక్షల ఫేక్ నోట్లు!

పంజాబ్ నేషనల్ బ్యాంకులో కొత్త స్కామ్.. వాల్ట్‌లో రూ.7కోట్ల 40 లక్షల ఫేక్ నోట్లు!

V6 Velugu 1 week ago

త్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనీ వాల్ట్‌లో ఊహించని భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకులోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన అసలు కరెన్సీ నోట్లను మాయం చేసి..

వాటి స్థానంలో అచ్చం అలాగే ఉండే నకిలీ నోట్లను పేర్చినట్లు బయటపడింది. లక్షా రెండు లక్షలు కాదు ఏకంగా రూ.7కోట్ల 40 లక్షల మేర రియల్ కరెన్సీని నకిలీ నోట్లతో మాయం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ చౌబే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సదర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో సీనియర్ డివిజనల్ మేనేజర్ రవి కుమార్, కరెన్సీ చెస్ట్ మేనేజర్లు సుశీల్ శర్మ, అమిత్ కుమార్‌లను ప్రధాన నిందితులుగా చేర్చారు. మరోవైపు ఇదే బ్యాంకులో పనిచేస్తున్న హౌస్‌కీపర్ విశాల్ కుమార్‌పై కూడా చోరీకి సంబంధించి వేరే ఫిర్యాదు దాఖలు కావడం గమనార్హం. బ్యాంకు ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఈ స్థాయి మోసం జరిగే అవకాశం లేదనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

ఈ కొత్త స్కామ్ గుట్టు రట్టు కావడానికి RBI తనిఖీలే కారణమయ్యాయి. ఆగస్ట్ 10న ఆర్బీఐకి పంపిన నగదు రెమిటెన్స్‌లో రూ.4లక్షల 36వేలు కొరత ఉన్నట్లు గుర్తించారు. దీనిపై అనుమానం వచ్చిన ఆర్బీఐ ఆదేశాల మేరకు పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించగా.. వాల్ట్‌లోని కరెన్సీ నోట్లలో అసలైన వాటికి బదులు నకిలీ నోట్లు కుప్పలు తెప్పలుగా ఉన్నట్లు బయటపడింది. ప్రస్తుతం నోట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండటంతో.. మొత్తం ఎంత మోసం జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ కుంభకోణం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సహారన్‌పూర్ డీఐజీ అభిషేక్ ప్రత్యేకంగా ఒక సిట్‌ను ఏర్పాటు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, దోచుకున్న కరెన్సీని పూర్తిగా రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. బ్యాంకు లావాదేవీల రికార్డులు, ఆడిట్ లెడ్జర్లు, కరెన్సీ చెస్ట్ సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నకిలీ నోట్లను బ్యాంకులోకి ఎలా స్మగ్లింగ్ చేశారు.. దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ సాగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News