Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రాజెక్టులకు పైసలియ్యండి..పీఎంకేఎస్‌వై కింద పనులు చేయించండి: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

ప్రాజెక్టులకు పైసలియ్యండి..పీఎంకేఎస్‌వై కింద పనులు చేయించండి: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

V6 Velugu 6 days ago
  • ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల్లో సడలింపులు ఇవ్వండి
  • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రుణాలు అందేలా చూడండి
  • రాష్ట్రాల మధ్య నీటి పంపకాల సమస్యలను పరిష్కరించండి
  • పాలమూరు రంగారెడ్డి, సీతమ్మసాగర్, డిండి, గౌరవెల్లికి పర్యావరణ అనుమతులివ్వండి
  • కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్‌కు మంత్రి ఉత్తమ్‌ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మసాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలన్నారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర జల శక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి జల్ సంచయ్ జన్ భాగీదారి జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యి, తెలంగాణకు సంబంధించి పలు విజ్ఞప్తులు చేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు వచ్చేలా చూడాలని కోరారు.

దానికి ఆయన సానుకూలంగా స్పందించారని ఉత్తమ్ తెలిపారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో కట్టేందుకు కోరామని, అనుమతి వస్తుందన్న ధీమా ఉందని చెప్పారు. పీఎంకేఎస్‌వై కింద అర్హత ఉన్న ప్రాజెక్టులకు కేంద్ర నిధులు మంజూరు చేయాలని, అందుకు నిబంధలను సడలించాలని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా సులభంగా రుణాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల మధ్య నీటి పంపకాల సమస్యలను కేంద్రం సత్వరమే పరిష్కరించాలన్నారు.

జాతీయ నీటి భద్రతా విధానం రూపొందించండి...

దేశవ్యాప్తంగా జల సంరక్షణ పనులన్నింటినీ ఒకే తాటిపైకి తెస్తూ సమగ్ర జాతీయ నీటి భద్రతా విధానం రూపొందించాల్సిందిగా​మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి కోరారు. తాగు నీరు, వ్యవసాయ స్థిరత్వం, గ్రామీణ జీవనోపాధి, పట్టణాల మనుగడ, పర్యావరణ పరిరక్షణతో ముడిపడి ఉన్న ఒక ప్రజా ఉద్యమంగా ఇది మారాలని పిలుపునిచ్చారు. ప్రతి నీటి సంరక్షణ నిర్మాణానికి జియో-ట్యాగింగ్ చేసి యూనిక్ ఐడీని కేటాయించాలన్నారు. నిధులకు సంబంధించి కస్టోడియన్‌ను నియమించాలని కోరారు. గ్రామ/పట్టణ స్థాయి నీటి ప్రణాళికలన్నీ రాష్ట్ర స్థాయి ఆస్తుల రిజిస్టర్‌కు, పనితీరు కొలమాన వ్యవస్థకు అనుసంధానం కావాలని పేర్కొన్నారు.

నీటి సంరక్షణలో తెలంగాణ నంబర్ వన్..

నీటి సంరక్షణలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 2025లో జల్ సంచయ్ జన్ భాగీదారి కింద దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా గుర్తింపు పొందిందని, దేశంలోని టాప్-50 జిల్లాల్లో తెలంగాణకు చెందిన 13 జిల్లాలు నిలవడం గర్వకారణమని చెప్పారు. ''తెలంగాణలో మొత్తం 44,360 చెరువులు, కుంటలు ఉండగా.. ఇప్పటివరకు 28,739 చెరువుల్లో పనులు చేపట్టి, 22,428 చెరువులను పునరుద్ధరించాం. 74 మేజర్, మీడియం ప్రాజెక్టుల ద్వారా 74.51 లక్షల ఎకరాల ఆయకట్టు సామర్థ్యాన్ని సృష్టించాం. మరో 53.18 లక్షల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేయాల్సి ఉంది. రాబోయే మూడేండ్లలో రూ.46,110.35 కోట్లతో 17.28 లక్షల ఎకరాలకు కొత్తగా సాగు నీరు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం.

ప్రాజెక్టులకు అవసరమైన 4.43 లక్షల ఎకరాల భూమిలో ఇప్పటికే 3.95 లక్షల ఎకరాలు సేకరించాం. మిగిలిన భూసేకరణను వేగవంతం చేయడంతో పాటు 60,531 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉంది'' అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 159 మేజర్, మీడియం రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యం దాదాపు 929 టీఎంసీలని, 222.90 టీఎంసీల సామర్థ్యం గల 18 ప్రాజెక్టులపై నిర్వహించిన అధ్యయనాల్లో పూడిక కారణంగా 40.97 టీఎంసీల నిల్వ సామర్థ్యం తగ్గిపోయినట్లు తేలిందని చెప్పారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News