జీడిమెట్ల, వెలుగు: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
మంగళవారం నిజాంపేట్‌లోని ఎస్టీ బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల, డిగ్రీ కాలేజీ, హాస్టల్ భవనాన్ని కలెక్టర్ మనుచౌదరితో కలిసి ఆయన పరిశీలించారు. భవనం పక్కనే డంపింగ్ యార్డు ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు వివరించారు.
డంపింగ్ యార్డు వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని సమీపంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నివాసితులు, స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి డంపింగ్ యార్డును పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి యార్డును తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ 30 రోజుల్లో డంపింగ్ యార్డును తరలిస్తామని హామీ ఇచ్చారు.
భూముల కబ్జాలను సహించం..
మేడ్చల్: దళిత విద్యార్థుల సంక్షేమం కోసం కేటాయించిన ఒక్క గజం భూమిని కబ్జా చేసినా ఊరుకోబోమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన భూములు అన్యాక్రాంతమవుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి శివారులోని భూములను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన భూములపై సర్వే చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

