Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రమాద పరిహారంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు

ప్రమాద పరిహారంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు

V6 Velugu 2 weeks ago
  • పరిహారం లెక్కించడానికి 'ఐటీఆర్' ప్రామాణికమని వెల్లడి

న్యూఢిల్లీ: ఏదైనా ప్రమాదంలో మరణించిన లేదా గాయపడిన బాధితుల వార్షిక ఆదాయాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆధారంగా కోర్టులు ఎలా లెక్కించాలనే దానిపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

మోటారు ప్రమాద పరిహారం చెల్లింపుల్లో ఒకే విధానం తీసుకురావాలనే ఉద్దేశంతో బుధవారం కీలక తీర్పును వెలువరించింది. జీతం తీసుకునే ఉద్యోగులకు, స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తూ జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్‌ తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. మోటార్ వాహనాల చట్టం కింద వార్షిక ఆదాయాన్ని లెక్కించడానికి ఎటువంటి కఠినమైన ఫార్ములాను వర్తింపజేయలేమని కోర్టు పేర్కొంది. జీతం పొందే ఉద్యోగుల వార్షిక ఆదాయాన్ని నిర్ధారించడానికి గత ఒక్క ఏడాది ఐటీఆర్ సరిపోతుందని, ఉద్యోగులకు వచ్చే ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి ఆర్థిక మార్పులు తాజా ఐటీఆర్‌లోనే ప్రతిబింబిస్తాయని కోర్టు పేర్కొంది. ప్రమాదానికి కొద్ది రోజుల ముందే ప్రమోషన్ వచ్చి, అది ఐటీఆర్‌లో నమోదు కాకపోతే.. ప్రమోషన్ లెటర్లు, ఇతర ఆర్థిక పత్రాలను కూడా కోర్టులు పరిశీలించవచ్చని తెలిపింది.

స్వయం ఉపాధి పొందేవారి వార్షిక ఆదాయాన్ని అంచనా వేయడానికి గత మూడేండ్ల ఐటీఆర్ రిటర్నుల సగటును ప్రామాణికంగా తీసుకోవాలని, ఒకటి లేదా రెండు ఏండ్ల ఐటీఆర్‌లు దాఖలు చేసి ఉంటే, వ్యాపార వృద్ధి రేటు పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. 'ఐటీఆర్ అనేది చట్టబద్ధమైన పత్రం. మోటార్ వాహనాల చట్టం కింద పరిహారాన్ని అంచనా వేయడానికి ఇది చాలా ముఖ్యమైన ఆధారం. మరణం లేదా గాయపడిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఎక్కువ ఆదాయాన్ని చూపిస్తూ ఐటీఆర్‌లు దాఖలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఐటీఆర్ దాఖలు చేసిన తేదీ కూడా కీలకమైనదే' అని జస్టిస్ సంజయ్ కరోల్ పేర్కొన్నారు. నిర్మాణ రంగ వ్యాపారి రష్మిరేఖ త్రిపాఠి కుటుంబానికి, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు మధ్య జరిగిన వివాదంలో దాఖలైన అప్పీలును విచారిస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News