Dailyhunt
ప్రీతి పంచ్‌ అదుర్స్..ఒలింపిక్ మెడలిస్ట్‌ను ఓడించి ఫైనల్ చేరిన ప్రీతి పవార్‌

ప్రీతి పంచ్‌ అదుర్స్..ఒలింపిక్ మెడలిస్ట్‌ను ఓడించి ఫైనల్ చేరిన ప్రీతి పవార్‌

V6 Velugu 3 days ago
  • ఒలింపిక్ మెడలిస్ట్‌ను ఓడించి ఫైనల్ చేరిన ప్రీతి పవార్‌
  • ప్రియ, అరుంధతి కూడా .. కాంస్యాలతో నిఖత్, లవ్లీనా సరి

ఉలాన్‌బాటర్ (మంగోలియా): ఇండియా బాక్సర్ ప్రీతి పవార్‌ ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సంచలన విజయం సాధించింది.

పారిస్ ఒలింపిక్ మెడలిస్ట్‌ను ఓడిస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆమెతోపాటు ప్రియ, అరుంధతి చౌదరి కూడా గోల్డ్‌ మెడల్ బౌట్స్‌కు చేరుకోగా... డబుల్‌ వరల్డ్ చాంపియన్‌, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్, ఒలింపిక్ మెడలిస్ట్‌ లవ్లీనా బొర్గోహైన్ సెమీస్‌లోనే ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. సోమవారం జరిగిన విమెన్స్ 54 కేజీ సెమీస్‌లో ప్రీతి పవార్ 5-0తో కొరియా బాక్సర్ ఏజీ ఇమ్‌ను చిత్తు చేసింది. మూడు రౌండ్ల పాటు పూర్తి ఆధిపత్యం చెలాయించిన ప్రీతి తన పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫైనల్లో తను మూడుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన చైనీస్ తైపీ బాక్సర్ హువాంగ్ హియావో-వెన్‌తో తలపడనుంది. 60 కేజీ సెమీస్‌లో ప్రియ 5-0తో మంగోలియా బాక్సర్ నమున్ మోంఖోర్‌పై ఘన విజయం సాధించింది. తుదిపోరులో తను నార్త్‌ కొరియాకు చెందిన ఉన్ గ్యాంగ్ వోన్‌ను ఢీకొంటుంది.70 కేజీ సెమీస్‌లో అరుంధతి చౌదరి 4--1తో ఓయిషా తోయిరోవా (ఉజ్బెకిస్తాన్‌)పై పోరాడి గెలిచింది. గోల్డ్ మెడల్ కోసం తను కజక్ బాక్సర్ బకిత్ సెయిడిష్‌తో తలపడనుంది.

నిరాశపరిచిన నిఖత్, లవ్లీనా

భారీ అంచనాలున్న ఇండియా స్టార్ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గోహైన్‌ సెమీస్‌లోనే వెనుదిరిగారు. 51 కేజీ బౌట్‌లో నిఖత్ జరీన్ 0-5 తేడాతో ప్రస్తుత ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, చైనా బాక్సర్ వు యు చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. మూడు రౌండ్లలోనూ నిఖత్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. లవ్లీనా (75 కేజీ) కూడా 0--5తో అజీజా జోకిరోవా (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో చిత్తయింది. అంకుషిత బోరో (65 కేజీ) 0--3తో నిన్-చిన్ చెన్ ( చైనీస్ తైపీ) చేతిలో ఓడింది. పవర్ సప్లై సమస్య కారణంగా తొలి రౌండ్ తర్వాత ఈ మ్యాచ్ ఆగిపోవడంతో, అప్పటివరకు వచ్చిన పాయింట్ల ఆధారంగా విజేతను ప్రకటించారు. మరో సెమీస్‌లో పూజా రాణి (80 కేజీ) 0--5తో కజకిస్తాన్ బాక్సర్ నదేజ్దా చేతిలో పరాజయం పాలైంది. సెమీస్‌లో ఓడిన నలుగురు బాక్సర్లకు కాంస్య పతకాలు లభించాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News