Dailyhunt
రాజా రవివర్మ గీసిన యశోద-కృష్ణ పెయింటింగ్ కు.. వేలంలో  రూ.167 కోట్లు

రాజా రవివర్మ గీసిన యశోద-కృష్ణ పెయింటింగ్ కు.. వేలంలో రూ.167 కోట్లు

V6 Velugu 0 months ago

ప్రముఖ కళాకారుడు రాజా రవి వర్మ గీసిన యశోద కృష్ణ అనే తైలవర్ణ చిత్రం వేలంలో రికార్డ్ సృష్టించింది. ఏప్రిల్ 1న బుధవారం ముంబైలో జరిగిన సాఫ్రనార్ట్ స్ప్రింగ్ లైవ్ వేలంలో పారిశ్రామికవేత్త, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడైన బిలియనీర్ సైరస్ పూనావాలా ఈ పెయింటింగ్ ను రూ.

167.2 కోట్లకు దక్కించుకున్నారు.

గతేడాది ఢిల్లీకి చెందిన కలెక్టర్ కిరణ్ నాదర్‌కు రూ. 118 కోట్లకు పైగా ధరకు అమ్ముడైన ఎంఎఫ్ హుస్సేన్ అన్‌టైటిల్డ్ (గ్రామ్ యాత్ర) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.వర్మ పెయింటింగ్ రూ. 80 కోట్ల నుంచి రూ. 120 కోట్ల మధ్య ధర పలుకుతుందని అంచనా వేయగా రెట్టింపు ధరకు అమ్ముడైంది. రవివర్మ ఈ చిత్రాన్ని1890వ దశకంలో వేశారు. ఈ పెయింటింగ్ లో యశోద ఆవు పాలు పితుకుతుండగా వెనుక నుంచి బాలకృష్ణుడు పాలపాత్రను అందుకోవడానికి చేయి చాస్తున్నట్లుగా పెయింటింగ్ ఉంది.

రాజా రవి వర్మ ఎవరు?

రాజా రవి వర్మ 1848లో కేరళ ట్రావన్‌కోర్‌లోని కిలిమానూర్ ఉన్నత కుటుంబంలో జన్మించాడు . వర్మ భారతదేశంలో తైలవర్ణ చిత్రకళకు ప్రాచుర్యం కల్పించారు. రాజా రవి వర్మ (1848 - 1906) భారతీయ చిత్రకళా చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన , ప్రసిద్ధ చిత్రకారుడు. భారతీయ సంప్రదాయ కళకు, పాశ్చాత్య సాంకేతికతను అద్దిన అద్భుత సృజనశీలి .

మనం నేడు పూజా గదుల్లో చూస్తున్న లక్ష్మీదేవి, సరస్వతి వంటి దేవతల రూపాలకు ప్రాణం పోసింది ఆయనే. పురాణాల్లోని పాత్రలను మానవ రూపంలో, అత్యంత సహజంగా చిత్రించడం ఆయన ప్రత్యేకత.అప్పట్లో చిత్రపటాలు కేవలం ధనవంతులకే పరిమితమయ్యేవి. కానీ ఆయన 1894లో ఒక ప్రింటింగ్ ప్రెస్‌ను స్థాపించి తన చిత్రాలను తక్కువ ధరకు ముద్రించి సామాన్యుల ఇళ్లకు కూడా దేవుళ్ల పటాలు చేరేలా చేశారు.

1893లో చికాగోలో జరిగిన ప్రపంచ ప్రదర్శనలో ఆయన చిత్రాలకు అవార్డులు లభించాయి. అప్పట్లోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అతికొద్ది మంది భారతీయ కళాకారులలో ఆయన ఒకరు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News