Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజకీయాల్లోకి  వచ్చే ఆలోచన లేదు:  సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

V6 Velugu 6 days ago
  • సమస్యలపై ఒత్తిడి తెచ్చేప్రెషర్ గ్రూపుగానే ఉంటం
  • సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
  • భారతదేశానికి ఇప్పుడు కావాల్సింది అదేనని వెల్లడి
  • మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో రెండు రోజుల
  • కోర్ టీమ్ సమావేశం ప్రారంభం

ఛత్రపతి శంభాజీనగర్: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రస్తుతానికి ఒక ప్రెషర్ ​గ్రూపుగానే ఉంటుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ఇప్పుడు భారతదేశానికి కావలసింది ఒత్తిడి బృందమేనని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలోని తన స్వస్థలమైన ఛత్రపతి శంభాజీనగర్‌లో బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న సీజేపీ కోర్ టీమ్ సమావేశానికి ముందు మీడియాతో దీప్కే మాట్లాడారు. సీజేపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఈ విషయంలో తమ కంటే మీడియానే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోందని దీప్కే చమత్కరించారు. అయితే, సీజేపీ రాజకీయ పార్టీగా మారే ఆలోచన లేదని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ పార్టీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలు ఉదయం ఒక పార్టీకి ఓటు వేస్తే.. సాయంత్రానికల్లా వేరొకరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

అలాగే, ప్రజలు న్యాయవ్యవస్థ, రాజకీయాలు, మీడియా, ఎన్నికల సంఘంపై విశ్వాసం కోల్పోయారని దీప్కే పేర్కొన్నారు. జంతర్​మంతర్​వద్ద చేపట్టిన తమ ఆందోళనకు దేశవ్యాప్త మద్దతు లభించిందని.. ఆందోళన పెరిగేకొద్దీ ఆ మద్దతు కేవలం విద్యా సమస్యలకే పరిమితం కాలేదని.. ఈ సంస్థలకు కూడా విస్తరించిందన్నారు. అందువల్ల, ఈ సంస్థలలో జవాబుదారీతనం తీసుకురావడానికి ఒక ప్రజా ఒత్తిడి బృందం అవసరమని దీప్కే అన్నారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రెషర్ గ్రూపుగా తాము ఉంటామని వెల్లడించారు. అలాగే, సీజేపీ కోర్ టీమ్ సమావేశం గురించి మాట్లాడుతూ.. 'న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మేము చేపట్టిన ఆందోళనకు దేశవ్యాప్త స్పందన లభించింది. దీంతో మాపై బాధ్యత పెరిగింది. మాపై ప్రజల అంచనాలు కూడా పెరిగాయి. కోర్ టీమ్ సమావేశంలో తమ సంస్థ ఎలా ఎదగాలో నిర్ణయించడంతో పాటు భవిష్యత్తు కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందిస్తాము. మీడియా, న్యాయవ్యవస్థ వంటి సంస్థలపై ప్రజల విశ్వాసం సన్నగిల్లడంపైనా ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. అలాగే, ఇథనాల్ మిశ్రమ ఇంధనం, పెరుగుతున్న నిరుద్యోగం వంటి సమస్యలను కూడా చర్చిస్తుంది' అని దీప్కే వివరించారు. సీజేపీ కోర్ టీమ్ సమావేశం గురువారం కూడా కొనసాగుతుందని, మీటింగ్​లో తీసుకున్న నిర్ణయాల గురించి గురువారమే తెలియజేస్తామని దీప్కే చెప్పారు. ఈ మీటింగ్​లో దీప్కే, సీజేపీ చీఫ్​స్పోక్స్​పర్సన్ సౌరవ్ దాస్, సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, రత్న సింగ్ తదితరులు పాల్గొన్నారు.

జార్ఖండ్‌ విద్యార్థులకు మద్దతు..

జార్ఖండ్‌ రాష్ట్రంలో జేపీఎస్‌సీ ఇతర నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు సీజేపీ మద్దతు ప్రకటించింది. జులై 29 నుంచి రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరవధిక దీక్ష చేస్తున్న నిరుద్యోగులకు మద్దతు తెలిపేందుకు సీజేపీ సభ్యులు జార్ఖండ్‌కు వెళ్తారని దీప్కే తెలిపారు. 'మేం కచ్చితంగా జార్ఖండ్‌కు వెళ్తాము. వారితో నిలబడతం. ఆందోళనలో వారి ప్రతి డిమాండ్‌కు మద్దతు ఇస్తాం' అని పేర్కొన్నారు. జార్ఖండ్‌ లోక్‌తాంత్రిక్ క్రాంతికారి మోర్చా సభ్యుడు దేవేంద్ర నాథ్ మహతో గత 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుండగా.. మంగళవారం మరో ఐదుగురు దీక్ష చేపట్టారు. దీంతో నిరాహార దీక్ష చేస్తున్న వారి సంఖ్య ఆరుకు పెరిగింది. కాగా, మహతో షుగర్, బీపీ ​లెవల్స్​ పడిపోతున్నందున కనీసం నీళ్లైనా తాగాలని వాంగ్​చుక్ ​సలహా ఇచ్చారు. దీంతో మహతో బుధవారం నీళ్లు తాగారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News