సర్ ప్రక్రియపై ఎన్నికల సంఘంలోనే అసమ్మతి ఉందంటూ వస్తున్న వార్తలపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. రాజ్యాంగ వ్యతిరేకులు ఎవరో తేలిపోయింది..
న్యాయం గెలుస్తుంది అంటూ ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ అంశంపై స్పందిస్తూ 2026 సెప్టెంబర్ 24న ఎక్స్ లో ఓట్ చోరీ అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేశారు రాహుల్. గురువారం సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ట్వీట్ చేశారు.
అంతకు ముందు ఓట్ చోరీ రాజ్యాంగంపై డైరెక్ట్ అటాక్ అంటూ బుధవారం ఆరోపించిన రాహుల్.. బీజేపీ, ఆర్ఎస్ఎస్,ఎన్నికల సంఘం కలిసి సర్ పేరుతో రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నాయని అన్నారు. ఈ మూడు కలిసి దేశద్రోహానికి పాల్పడుతున్నట్లు విమర్శించారు.
ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు సర్ ప్రక్రియకు సంబంధించిన విషయాలపై ఎన్నికల సంఘంలో పదేపదే అభ్యంతరాలు లేవనెత్తారని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొన్న తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా సర్ అమలును ముగ్గురు కమిషనర్లు పర్యవేక్షించారని నివేదిక పేర్కొంది. అయితే, తమకు తెలియకుండా తీసుకున్న తీసుకున్న నిర్ణయాలు, ఉత్తర్వులకు సంబంధించి గత 10 నెలల్లో సంధు, జోషి కనీసం 14 సార్లు అధికారికంగా తమ అభ్యంతరాలను నమోదు చేశారని రిపోర్టు పేర్కొంది. ఇందులో ఒకే రోజు నాలుగు సార్లు అభ్యంతరాలు లేవనెత్తినట్లు కూడా తెలుస్తోంది.
ఎన్నికల కమిషనర్లు వ్యతిరేకించినప్పటికీ.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష ధోరణితో బీజేపీకి, ఎన్డీఏ పక్షాలకు మేలు చేసేందుకు ప్రయత్నించారని విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందిగా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియలో కూడా మునుపటి విధానాన్ని అనుసరించాల్సిందిగా డిమాండ్లు వస్తున్నాయి. ఈ ప్రక్రియలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని చేర్చాలనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నికల కమిషనర్ ను ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ లు నియమించేవారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించి ఆ స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చారు.

