Dailyhunt
రైతులకు ఉచితంగా రాజన్న కోడెల పంపిణీ.. ఆన్ లైన్ లో అప్లై చేసుకోండి

రైతులకు ఉచితంగా రాజన్న కోడెల పంపిణీ.. ఆన్ లైన్ లో అప్లై చేసుకోండి

V6 Velugu 4 days ago

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో రైతులకు ఉచితంగా రాజన్న కోడెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్‌తో కలిసి రైతులకు కోడెలను అందజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో కోడె మొక్కులు చెల్లించే గొప్ప సంస్కృతి ఉందని కొనియాడారు. భక్తులు స్వామివారికి సమర్పించిన ఈ కోడెలను, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులకు వ్యవసాయ పనుల కోసం ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు.

వ్యవసాయ, పశుసంవర్ధక, దేవదాయ శాఖల సమన్వయంతో.. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులైన రైతులను ఎంపిక చేసి ఈ పంపిణీ చేపట్టారు. రాజన్న ప్రసాదంగా పొందిన ఈ కోడెలను రైతులు తమ బిడ్డల్లా సంరక్షించుకోవాలని, అధికారులు కూడా అప్పుడప్పుడు వీటి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారని ఆయన స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ ప్రత్యేక చొరవతో గోశాలల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని.. త్వరలోనే 40 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వసతులతో కూడిన అధునాతన గోశాలను నిర్మిస్తామని విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News