రెరా బాగుంది కానీ... కొన్ని మార్పులు కావాలి
V6 Velugu Posted on Jul 29, 2021
న్యూఢిల్లీ: రియాల్టీ రంగం కోసం కొత్తగా తెచ్చిన రెరా యాక్ట్70 శాతం మంది కన్జూమర్లకు తెలుసని ఒక సర్వేలో తేలింది. ఇండ్లు కొన్న ప్రతీ ఆరుగురిలో అయిదుగురు కన్జూమర్లు తమ కంప్లయింట్లను పరిష్కరించుకోవడానికి రెరాపై ఆధారపడుతున్నట్లు వెల్లడయింది. ఒమిడ్యార్ నెట్వర్క్ ఇండియా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్లు కలిసి ఈ సర్వేను నిర్వహించాయి. కంప్లెయింట్ల పరిష్కారం కోసం రెరా కింద అనుసరిస్తున్న కొన్ని విధానాలు మారాలని కన్జూమర్లు కోరుకుంటున్నారు.
సర్వే రిపోర్టు కోసం 1300 మంది కన్జూమర్లు, డెవలపర్లు, రెగ్యులేటరీ అథారిటీస్, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు వంటి వారితో మాట్లాడినట్లు ఒమిడ్యార్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్లు వెల్లడించాయి. మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాలలో ఈ సర్వేను నిర్వహించామని పేర్కొన్నాయి. ఇళ్ల కొనుగోలుదారులలో డెవలపర్ల పట్ల నమ్మకాన్ని పెంచడానికి రెరా యాక్ట్ సాయపడుతున్నట్లు సర్వేలో తేలింది. ప్రతీ ప్రాజెక్టుకూ ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేయడం వంటివి ఇళ్ల కొనుగోలుదారుల నమ్మకాన్ని పెంచినట్లు వెల్లడయింది. అంతేకాదు, డెవలపర్లలో అకౌంటబిలిటీని కూడా రెరా పెంచగలిగిందని సర్వే రిపోర్టు చెబుతోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మందికి రెరా గురించి తెలుసని, కానీ దాని ప్రధాన బెనిఫిట్స్ మాత్రమే వారికి తెలుసని పేర్కొంది. యాక్టు గురించిన అవగాహన ఉన్న వారిలో 71 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వివరించింది. రెరా గురించి తెలుసున్న వారిలో 76 శాతం మంది రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాపర్టీలనే కొంటామని చెప్పినట్లు సర్వే రిపోర్టు తెలిపింది.
ఇక డెవలపర్లకి వస్తే, సర్వేలో పాల్గొన్న వారిలో 64 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఒమిడ్యార్, బోస్టన్ సర్వే రిపోర్టు వెల్లడించింది. రెరా వల్ల తమకు లోన్లు ఈజీగా దొరుకుతున్నాయని 55 శాతం మంది డెవలపర్లు పేర్కొన్నట్లు తెలిపింది. రెరా మరింతగా సక్సెసవాలంటే ఇంకా కొన్ని చర్యలను తీసుకోవాల్సి ఉందని సర్వే రిపోర్టు అభిప్రాయపడింది. రెరా రెగ్యులేటరీ రోల్ గురించి 30 శాతం మంది కన్జూమర్లకు అసలు తెలీనే తెలీదని పేర్కొంది. ఈ యాక్ట్ వల్ల కలిగే రెండు బెనిఫిట్స్మాత్రమే తెలుసని ప్రతి ఇద్దరు కన్జూమర్లలో ఒకరు చెప్పారని సర్వే రిపోర్లు వెల్లడించింది.
మన దేశంలోని కుటుంబాలు తమ పెట్టుబడులలో సగటున 75 శాతాన్ని రియల్ ఎస్టేట్ రంగంలోనే పెడుతున్నాయి. దేశంలోని మొత్తం సివిల్ కేసులలో 66 శాతం కేసులు ల్యాండ్, ప్రోపర్టీలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో రెరా రోల్ చాలా ముఖ్యమైనది. రెరా అయిదేళ్ల అనుభవాన్ని చూస్తే, సరయిన డైరెక్షన్లోనే జర్నీ ఉందని తేలుతోంది. రియల్ ఎస్టేట్ రంగంపై కన్జూమర్ల నమ్మకం పెరిగింది.
శిల్పా కుమార్, పార్ట్నర్, ఒమిడ్యార్ నెట్వర్క్ ఇండియా

