టెల్ అవీవ్/దుబాయ్/న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన పెను ప్రమాద ఘటనపై ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో మచ్చర్‌కు కృతజ్ఞతలు వెల్లువెత్తాయి.
"ఆ పేరు మర్చిపోకండి.. స్మిత్ మచ్ఛర్ ఒక నిజమైన హీరో" అంటూ ఇజ్రాయెల్ నెటిజన్లు, ప్రముఖులు వీడియోలు షేర్ చేస్తున్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ భారతీయ పైలట్ ధైర్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు దేశం గర్వించేలా చేశాయని రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ కొనియాడారు.
ఇది భూమిపైనే అద్భుతమైన కథ కావచ్చు..
ప్రాణాలను పణంగా పెట్టి విమానంలోని ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌ను 'రియల్ హీరో'గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. వాషింగ్టన్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ "ఇది భూమిపైనే అత్యంత అద్భుతమైన కథ కావచ్చు" అంటూ వివరించారు.
కో-పైలట్ ఒక ఉగ్రవాదిలా లేదా పిచ్చివాడిలా ప్రవర్తించి పైలట్‌పై కత్తితో దాడి చేశాడని తెలిపారు. "పైలట్ చాలా తీవ్రమైన గాయాలపాలైనప్పటికీ ఆయన అసాధారణమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించి, కష్టపడి కాక్‌పిట్ డోర్ తెరిచి సహాయం కోసం గట్టిగా కేకలు వేశారు. ఆయన నిజంగా హీరో" అని ట్రంప్ కొనియాడారు.
నిజమైన హీరో..
కో-పైలట్ విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చివేసి, ప్రయాణికులను పొట్టనబెట్టుకోవాలని చూశాడని నెతన్యాహు వెల్లడించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛర్ తన ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడి, పెను ప్రమాదాన్ని అడ్డుకున్నాడని ప్రశంసించారు. ఇజ్రాయెల్ పౌరులతో సహా మొత్తం 174 మంది ప్రాణాలను కాపాడిన ఆయన "నిజమైన హీరో" అని అభివర్ణించారు.
దేశం గర్విస్తోంది..
ఫ్లైదుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు దేశం గర్వించేలా చేశాయని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ ఆయన చూపిన తెగువ వల్ల వందలాది ప్రాణాలు దక్కాయని, ఇది మరో ఘోర విషాదాన్ని నివారించిందని మోదీ అభివర్ణించారు. ఈ ఘటన తర్వాత మోదీ స్వయంగా స్మిత్ మచ్చర్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
మచ్ఛర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, అద్భుతమైన సమయస్ఫూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఆయన పట్ల దేశం గర్విస్తోందని పేర్కొన్నారు. భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

